
నాన్న కల నెరవేర్చాను
చేగుంట(తూప్రాన్): గ్రూప్1లో స్టేట్ ర్యాంకు సాధించి తన తండ్రి కల నెరవేర్చినట్లు ఏరెడ్ల నిఖిత పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు మల్టీజోన్‌లో 2వ ర్యాంకు సాధించిన ఉమ్మడి మెదక్ జిల్లా హత్నూర మండలం కొడిప్యాకకు చెందిన ఏరెడ్ల నిఖిత మంగళవారం సాక్షితో మాట్లాడారు. గతంలోనే ఇంజనీరింగ్‌లో గోల్డ్ మెడలిస్టుగా మంచి ప్లేస్‌మెంట్ వచ్చినా వెళ్లలేదని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తన తండ్రి సుధాకర్‌రెడ్డి కల మేరకు సివిల్స్‌పై ఆసక్తి పెంచుకొని ఇంటర్వ్యూలో పాల్గొన్నానని, మరోసారి ప్రయత్నం చేసి సివిల్స్ సాధిస్తానని పేర్కొన్నారు. ఇటీవల గ్రూప్ 2లో 144, గ్రూప్ 3లో 372వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఏడాదిన్నర చదివిన చదువుకు తగిన ఫలితం రావడం ఆనందంగా ఉందన్నారు. పట్టుదలతో చదువుకుంటే ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండా గ్రూప్స్‌తో పాటు అన్ని పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చునన్నారు.
సాక్షితో గ్రూప్1 ర్యాంకర్ నిఖిత