
పదోన్నతులు.. బదిలీలు
● 6 ఏళ్ల తర్వాత పశుసంవర్థక శాఖలో కదలికలు ● జిల్లాలో 33మందిలో28మందికి అవకాశం ● సీనియారిటీ, రోస్టర్ పద్ధతిలోకేటాయింపు
సంగారెడ్డి జోన్: పశుసంవర్థక శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు పదోన్నతులివ్వడంతోపాటుగా మరికొంతమందికి స్థానచలనం కల్పించింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా అధికారులు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పశువైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు సీనియారిటీ, పని తీరును బట్టి అవకాశాలు కల్పించారు.
ఎల్.ఎస్.ఏగా ప్రమోషన్
పశువైద్యశాలలో వెటర్నిటీ అసిస్టెంట్లు (వీఏ)గా విధులు నిర్వహిస్తున్న వారికి లైవ్‌స్టాక్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ప్రతీఏటా ప్రమోషన్లు కల్పించాల్సి ఉండగా కొన్నేళ్లుగా వివిధ కారణాలతో కల్పించలేకపోయారు.
జిల్లాలో 28 మందికి పదోన్నతులు
జిల్లాలో 44 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 53 ఉపకేంద్రాలు, 5 ఏరియా వెటర్నరీ హాస్పిటల్, జిల్లా కేంద్రంలో ఒకటి ఉన్నాయి. ఆయా కేంద్రాలలో 33 మంది వీఏలు ఉండగా 28మంది ఎల్.ఎస్.ఏగా పదోన్నతులు కల్పించింది. జోన్ 6 లో భాగంగా స్థానచలనం అయిన వారిలో నలుగురికి ఇతర జిల్లాలకు ట్రాన్స్‌ఫర్ చేయగా మిగతా 24 మంది అధికారులకు సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. ఇతర జిల్లాల నుంచి మరో నలుగురు సంగారెడ్డి జిల్లాకి పదోన్నతిపై రానున్నారు.
సీనియారిటీ,
రోస్టర్ సిస్టమ్ ప్రకారం...
పశుసంవర్థక శాఖలో విధులు నిర్వహిస్తున్న వీఏలకు సీనియారిటీతోపాటు రోస్టర్ పద్ధతిలో కేటాయించారు. పదోన్నతులకు నిర్దేశించిన అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించారు. ఉద్యోగుల సీనియారిటీ, పనితీరును బట్టి అందించిన సేవలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రమోషన్ల ప్రక్రియను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చేపట్టినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు.
ఆరేళ్ల తర్వాత...
జోనల్ 6 ఏర్పడిన అనంతరం సుమారు ఆరేళ్ల తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపట్టింది. జోనల్ 6లో సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చ ల్, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. జోనల్ వ్యవస్థ ఏర్పాటు అనంతరం పదోన్నతులు బదిలీలు చేపట్టడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పశుగణన పూర్తయిన తర్వాతే..
ఇటీవల చేపట్టిన పశుగణన జిల్లాలో కొనసాగుతోంది. ఈ నెల 15తో ప్రక్రియ పూర్తి కానుంది. పదోన్నతి పొందిన వారు వారి పరిధిలోని పశుగణన పూర్తి అయిన తర్వాతే రిలీవ్ కావలసి ఉంటుందని అధికారుల చెబుతున్నారు.