
శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్‌రావు
● పొలిటికల్ లీడర్ పాత్ర గొప్పది.. కష్టమైనది
● ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: నాయకత్వం అంటే ఎలా ఉండాలి.. నాయకుడు అనే వాడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చేయాల్సిన బాధ్యత గూర్చి, సమాజహితం గురించి పడే తపన, తదితర అంశాల గురించి ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేడర్‌కు వివరించాడు. నాయకుడు కూడా త్యాగధనుడే అంటూ వారికి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సిద్దిపేట నాలుగో వార్డులో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్‌శెట్టి(గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం) భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువత ఉపాధి కోసం మంచి ఉద్దేశంతో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకుడు కూడా గొప్పవడని, పొలిటికల్ లీడర్ ఒక క్వాలిటీ ఉంటుందని, బ్యాంక్ అధికారులు, ఇతర అధికారులు తరహాలోనే లీడర్‌కు కూడా ఒక లక్షణం ఉంటుందన్నారు. లీడర్ అనే వాడు సమాజానికి మార్గదర్శకుడని అభివర్ణించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటి సంస్థలను ప్రజల కోసం ఉపయోగించుకోవడంలో, ప్రజలను చైతన్యం చేయడంలో రాజకీయ నాయకుడు చొరువ చూపాలన్నారు. పదవులు లేవని, హోదా, అధికారం లేదనే భావన ఉండకుండా సేవలు అందించాలనే తపన ప్రతి లీడర్ మదిలో ఉండాలన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి...
నిరుద్యోగ యువత కోసం సెట్విన్, న్యాక్, ఎల్ అండ్ టి, ఆర్ శెట్టి, తదితర సంస్థల ద్వారా స్వయం ఉపాధి శిక్షణ కోర్సులు ఏర్పాటు చేసి శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కూడా అందించడం జరుగుతుందన్నారు. యూనియన్ బ్యాంక్ భవిష్యత్‌లో ఉపాధి శిక్షణ ఇచ్చి అదే క్రమంలో ఉపాధి మార్గం కోసం రుణాలు కూడా ఇవ్వడానికి తన సూచన మేరకు అంగీకారాన్ని ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్ కొండం కవిత సంపత్, నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు సాయిరాం, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యజిత్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ సత్యం, శ్రీనివాస్ పాల్గొన్నారు.