ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు చిరుజల్లులు కురవడంతో ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. కొన్ని గ్రామాల్లో ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. దీంతో రైతులు కాస్త ఇబ్బంది పడ్డారు.
బెజ్జంకిలో వడగళ్లు..
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని పలు గ్రామాలలో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. గాలి దుమారానికి బెజ్జంకి, కల్లెపల్లి, రేగులపల్లె, గుగ్గిల్ల, గాగిళ్లాపూర్ తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
నేటి నుంచి
ఇంటర్ మూల్యాంకనం
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు మూల్యాంకన కేంద్రం కన్వీనర్, జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్) లో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తెలుగు, పొలిటికల్ సైన్స్, గణితం, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామినర్లు సకాలంలో కార్యాలయంలో రిపోర్టు చేయాలని చెప్పారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆయా సబ్జెక్టుల ఎగ్జామినర్లను వెంటనే రిలీవ్ చేయాలన్నారు. మూల్యాంకన కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని అన్నారు. ఎగ్జామినర్లు సమయపాలన పాటించాలని, లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉపాధి కూలీలకు
వసతులు తప్పనిసరి
అక్కన్నపేట(హుస్నాబాద్): మండల పరిధిలోని మల్లంపల్లి, చౌటపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి బాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు ముదురుతున్న కొద్దీ పనుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేశారు. అలాగే కూలీల సమస్యలు, పని ప్రదేశంలో వసతులపై కూలీలను అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా పనిప్రదేశంలో సౌకర్యాలను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భానోతు జయరాం, ఎంపీఓ గుగులోతు మోహన్‌నాయక్, ఉపాధి హామీ ఏపీఓ ప్రభాకర్, టెక్నికల్ అసిస్టెంట్ నీలిమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.