
దూరంగా ఉండటంతో నిరుపయోగం
● రోడ్డుపక్కన కూరగాయల విక్రయాలు ● పట్టించుకోని పాలకులు, అధికారులు ● చిన్నతిమ్మాపూర్‌లో వ్యాపారుల అగచాట్లు
కూరగాయలు అమ్ముకునే వారి జీవనానికి ఉపయోగపడాల్సిన ‘విలేజ్ మార్కెట్’లు అలంకార ప్రాయాలుగా మారుతున్నాయి. సరైన స్థలంలో నిర్మిస్తే అమ్మకందారులకు, కొనుగోలుదారులకు ఉపయుక్తంగా ఉంటుంది. కాని ములుగు మండలం చిన్నతిమ్మాపూర్(వంటిమామిడి)లో మార్కెట్‌ను ఓ మూలన నిర్మించారు. దీంతో ఆ విలేజ్ మార్కెట్ నిరుపయోగంగా మారింది.
ములుగు(గజ్వేల్): ములుగు మండలం వంటి మామిడి నుంచి తున్కిబొల్లారం మార్గంలో చిన్నతిమ్మాపూర్ వద్ద రోడ్డుపక్కనే కూరగాయల విక్రయాలు నిర్వహిస్తారు. నిత్యం వాహనాల రద్దీ ఉండటంతో వారంతా ప్రమాదాల నీడలోనే కూర గాయలు అమ్ముకొనేవారు. అయితే వారి కోసం రూ.15లక్షల ఈజీఎస్, పంచాయతీ నిధులు వెచ్చించి యేడాదిన్నర క్రితం ‘విలేజ్ మార్కెట్’ నిర్మించారు. దాదాపు అరెకరం విస్తీర్ణంలో అంతర్గత రోడ్డులో 28 దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా మార్కెట్ షెడ్డు నిర్మించారు. గ్రామపంచాయతీకి ఆదాయం, కూరగాయల విక్రేతలకు ప్రయోజనం కలిగించే ఈ మార్కెట్ సముదాయంలో దుకాణాలను మాత్రం ఎవరికీ కేటాయించలేదు. దీంతో అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.ఆవరణంతా పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. శిథిలావస్థకు చేరుకుంటోందని స్థానికులు వాపోతున్నారు.
చిన్నతిమ్మాపూర్‌లో వృథాగా ఉన్న విలేజ్ మార్కెట్ ప్రాంగణం
బస్‌షెల్టర్‌లో కూరగాయల సామగ్రి
గ్రామానికి చెందిన కూరగాయల అమ్మకందారులకు ప్రత్యేకమైన స్థలం లేకపోవడంతో రోడ్డుపక్కనే వారు విక్రయాలు సాగిస్తున్నారు. అయితే వారు ప్రయాణికుల కోసం నిర్మించిన బస్‌షెల్టర్‌ను కూరగాయల అడ్డాగా మార్చేశారు.
అద్దె ప్రాతిపదికన తీర్మానం
రోడ్డుపక్క కూరగాయలు విక్రయించుకునే వారికోసం ఈజీఎస్, జీపీ నిధులతో విలేజ్ మార్కెట్ నిర్మింపజేశాం. అందులో 28 దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకుగాను నెల వారీ అద్దె ప్రాతిపదికన దుకాణాలు కేటాయించాలని తీర్మానం కూడా చేశాం.
– హంస మహేశ్, మాజీ సర్పంచ్
వినియోగంలోకి తెస్తాం..
చిన్నతిమ్మాపూర్‌లో విలేజ్ మార్కెట్ వృథాగా ఉన్న విషయం వాస్తవమే. 28 దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు సౌల భ్యం ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి మార్కెట్‌ను త్వరలోనే వినియోగంలోకి తెచ్చేలా చూస్తాం.
– మేరీ స్వర్ణకుమారి, ఎంపీడీఓ, ములుగు

దూరంగా ఉండటంతో నిరుపయోగం

దూరంగా ఉండటంతో నిరుపయోగం