
భూ భారతి రైతులకు వరం
కోహెడ(హుస్నాబాద్): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం రెవెన్యూ అధికారులు మండల కేంద్రంలోని హైస్కూల్ ఆవరణలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టం రైతులకు వరం కానుందన్నారు. దీంతో కోర్టుకు వెళ్లకుండానే సమస్యలు పరిష్కారం కానున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితోనే కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. సాదాబైనామాలు సైతం భూ భారతి ద్వారా పరిష్కారం కానున్నట్లు తెలిపారు. నాలుగు దిక్కులా హద్దులతో వ్యవసాయ మ్యాప్‌తో రిజిస్టేషన్లు అయ్యేలా భూ భారతి చట్టంలో ఉందన్నారు. రైతులు తమ సమస్యల పరిష్కరం కోసం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలు పెట్టుకోవాలని కోరారు. కాగా సదస్సుకు వచ్చిన పలువురి రైతుల సమస్యలకు కలెక్టర్ మనుచౌదరి సలహాలు, సూచనలు చేశారు. అలాగే తొమ్మిది మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. అంతకు ముందు సన్నబియ్యం లబ్ధిదారులు తలారి మల్లవ్వ, చంద్రయ్య ఇంట్లో మంత్రి భోజనం చేశారు. అనంతరం వింజపల్లి చౌరస్తా కురుమ వాడలో సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని మంత్రి అవిష్కరించారు. అనంతరం కురుమ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలో బుధవారం జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి–గుణచైతన్యరెడ్డి నిశ్చితార్థ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. జపాన్ పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా సంగారెడ్డికి చేరుకున్న రేవంత్‌రెడ్డి ముందుగా రాంనగర్‌లో ఉన్న రామాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నిశ్చితార్థ కార్యక్రమానికి చేరుకుని కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డితోపాటు, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ సురేశ్ షెట్కార్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కీలక భూ సమస్యలన్నీ ఇక పరిష్కారం
మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడలో అవగాహన సదస్సు

భూ భారతి రైతులకు వరం