టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచి ఇవాళ్టికి(ఏప్రిల్ 2, 2011) 12 ఏళ్లు పూర్తయింది. సొంతగడ్డపై జరిగిన ఈ వన్డే వరల్డ్‌కప్‌లో ధోని సారధ్యంలోని టీమిండియా 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ''ధోనీ.. ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్.. ఇట్స్ మెగ్నిఫిషెంట్ స్ట్రైక్ ఇంటూ ది క్రౌడ్. ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఈయర్స్...'' అంటూ కామెంట్రీ బాక్స్ లో రవిశాస్త్రి పలికిన ఆ నాలుగు ముక్కలు నాలుగు కాలాల పాటు అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి.
ఐదు కాదు పది కాదు.. ఏకంగా 28 ఏండ్ల ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీ కరువును తీరుస్తూ ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడే స్టేడియంలో ధోని సేన సృష్టించిన చరిత్రకు నేటికి పుష్కర కాలం. 2011, ఏప్రిల్ 02 రాత్రి వాంఖెడే హోరెత్తి దేశాన్ని ఊపేసిన ఆ అపురూప క్షణాలకు అప్పుడే 12 ఏండ్లు గడిచాయి. అయితే సరిగ్గా పుష్కరకాలం తర్వాత ఈ ఏడాది అక్టోబర్‌లో మన భారత్‌లో వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మరోసారి ఆ ఫీట్‌ను పునరావృతం చేస్తుందా అన్నది చూడాలి.
1983లో కపిల్ డెవిల్స్ భారత్ కు తొలి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ అందించిన తర్వాత సుదీర్ఘకాలం టీమిండియాకు ప్రపంచకప్ అందని ద్రాక్షే అయింది. సచిన్, అజారుద్దీన్, గంగూలీ, ద్రావిడ్ వంటి మహామహుల వల్ల కాని అసాధ్యాన్ని ధోని సేన సుసాధ్యం చేసిన ఆ క్షణాలు భారత క్రికెట్ లో ఎప్పటికీ మధురమే. స్వదేశంలో జరిగిన ఈ వన్డే వరల్డ్ కప్ లో భారత్ తో పాటు శ్రీలంక కూడా ఫైనల్ చేరాయి.
ఫైనల్ లో ఇలా..
క్వార్టర్స్ లో ఆస్ట్రేలియాను, సెమీస్ లో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరిన టీమిండియా.. ఫైనల్ లో లంకతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ జట్టులో మహేళ జయవర్దెనే (103) సెంచరీ చేయగా తిలకర్నతే దిల్షాన్ (48), నువాన్ కులశేఖర (32) రాణించారు.
275 పరుగుల లక్ష్యంలో భారత జట్టు.. 31కే ఓపెనర్లిద్దరి వికెట్లనూ కోల్పోయింది. వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ అవగా టోర్నీ ఆసాంతం రాణించిన సచిన్ టెండూల్కర్ (18) కూడా విఫలమయ్యాడు. అప్పుడే కొత్తగా టీమ్ లోకి వస్తున్న విరాట్ కోహ్లీ (35) తో కలిసి గౌతం గంభీర్ (97) భారత ఇన్నింగ్స్ ను కుదుటపరిచాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 83 పరుగులు జోడించారు. కానీ కోహ్లీని దిల్షాన్ ఔట్ చేశాడు.
ధోని మ్యాజిక్
కోహ్లీ నిష్క్రమణ తర్వాత వాస్తవానికి ఐదో స్థానంలో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కు రావాలి. కానీ సారథి ధోని.. క్రీజులోకి వచ్చాడు. గంభీర్ తో కలిసి ఒక్కో పరుగు కూడదీసుకుంటూ భారత్ ను విజయం వైపునకు నడిపించాడు. గంభీర్ - ధోనిలు నాలుగో వికెట్ కు 109 పరుగులు జోడించారు. గంభీర్ ను పెరీరా ఔట్ చేసినా అప్పటికే భారత విజయానికి చేరువలో ఉంది. చివర్లో యువరాజ్ (21 నాటౌట్) తో కలిసి ధోని.. 91 పరుగులతో నాటౌట్ గా నిలవడమే గాక భారత్ కు వన్డే వరల్డ్ కప్ అందించాడు.
ఈ ఏడాదైనా..
2011 తర్వాత భారత్ మళ్లీ వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. వన్డేలే కాదు టీ20లలో కూడా భారత్ కు నిరాశే ఎదురవుతున్నది. 2013లో ఇంగ్లాండ్ లో నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్.. ఐసీసీ ట్రోఫీలలో విఫలమవుతూనే ఉన్నది. ఈ ఏడాది భారత్ కు ఐసీసీ ట్రోఫీగా నిలవడానికి రెండు ఛాన్స్ లు ఉన్నాయి. 2023 జూన్ లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది. ఇప్పటికే ఫైనల్ చేరిన భారత జట్టు.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. అంతేగాక ఈ ఏడాది అక్టోబర్ లో స్వదేశంలోనే వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. మరి ఈ రెండింటిలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉండనుందో..?
Comments
Please login to add a commentAdd a comment