సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా ఈఎమ్‌ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, లేసర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో 37వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ జే ఎస్ సిధాన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరచిన సెయిలర్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. ఈ పోటీలను ఏషియన్ గేమ్స్ ట్రయల్స్‌గా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌ను నిర్వహిస్తున్న సికింద్రాబాద్ ఈఎమ్‌ఈ సెయిలింగ్ అసోసియేషన్‌ను అభినందించారు. అంతే కాకుండా క్రీడా రంగంలో యువతను విశేషంగా ప్రోత్సహిస్తున్న తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్ అభినందించారు.
లేజర్ స్టాండర్డ్, లేజర్ 4.7 తదితర విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో మంగళవారం వరకు 11 క్లబ్స్ నుంచి 89 మంది సెయిలర్స్ రిజిష్టర్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇందులో దేశ వ్యాప్తంగా 11 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సెయిలింగ్ వీక్ లో రాష్ట్రం నుంచి 17 మంది పాల్గొంటున్నారు. ఈ ఏడాది పోటీల్లో తన ప్రతిభను కనబరుస్తున్న 72 ఏళ్ల మురళి కానూరి అతి పెద్ద వయసు్కడిగా అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఈ పోటీలు 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ రఘురామ్ రెడ్డి, తదితర ఆర్మీ అధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment