‘‘నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. కోచ్ చెప్పినట్లుగా చేశాను. పతకం సాధించలేకపోయినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. గాయం నుంచి కోలుకునే క్రమంలో తక్కువ సమయమే దొరికినా దానిని సద్వినియోగం చేసుకోగలిగాను.
85 కిలోల బరువు ఎత్తడం కోసం ఎంతగానో ప్రాక్టీస్ చేశా. కాంపిటీషన్ సమయంలోనూ పొరపాట్లకు తావివ్వలేదు. క్లీన్ అండ్ జెర్క్ విషయంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నిజానికి.. పోటీకి సిద్ధమవుతున్నపుడే నా నెలసరి మొదలైంది.
ఇది మూడోరోజు. అది కూడా ప్రభావం చూపింది. వీక్‌నెస్ కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను. దేశం కోసం పతకం గెలవాలని ఎంతగానో కృషి చేశాను. అయినా.. ఆటలో గెలుపోటములు భాగమే. వచ్చే ఒలింపిక్స్ కోసం మరింత కష్టపడతా. అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి పతకం అందిస్తా’’ అంటూ భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఉద్వేగానికి లోనైంది.
నాలుగోస్థానంతో సరి
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో మీరాబాయి తృటిలో పతకం కోల్పోయిన విషయం తెలిసిందే. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ మణిపూర్ ఆణిముత్యం నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. ఫలితంగా కాంస్య పతకం చేజారింది.
ఫైనల్లో 12 మంది పోటీపడగా.. మీరాబాయి మొత్తం 199 కేజీల బరువు మాత్రమే ఎత్తగలిగింది. స్నాచ్‌లో 88 కేజీలు... తర్వాత క్లీన్ అండ్ జెర్క్ అంశంలో 111 కేజీలు బరువెత్తింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా గత టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే.
ఇక ఈ విభాగంలో చైనా వెయిట్‌లిఫ్టర్ హు జిహుయ్ మొత్తం 206 కేజీల బరువెత్తి( (చైనా; స్నాచ్‌లో 93 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు) స్వర్ణం సాధించగా.. రొమేనియాకు చెందిన మిహేలా వలెంటీనా మొత్తం 205 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన సురోద్‌చనా ఖాంబావ్ 200 కేజీల బరువెత్తి కాంస్యం కైవసం చేసుకుంది.
చదవండి: వినేశ్ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది?
Comments
Please login to add a commentAdd a comment