బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాపై తొలి రెండో టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా.. ఈ సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇండోర్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో టీమిండియా గెలుపొందితే.. నేరుగా ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇక ఇప్పటికే మూడో టెస్టు కోసం ఇరు జట్లు ఇండోర్‌కు చేరుకున్నాయి.
మార్చి 1 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. కాగా ఇండోర్ టెస్టుకు ముందు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 4-0తో క్లీన్ స్వీప్ చేస్తే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా అందుకుంటుందని రవిశాస్త్రి జోస్యం చెప్పాడు.
అయితే ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పేసర్లు చెలరేగే అవకాశం ఉంది అని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాగా 2021లో జరిగిన మొట్టమొదటి టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్‌ను టీమిండియా తృటిలో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
"బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 4-0 క్లీన్ స్వీప్ చేస్తే.. అది ఖచ్చితంగా ప్రత్యర్ధి జట్టును మానసికంగా దెబ్బతీస్తుంది. కానీ ఇంగ్లండ్ పరిస్ధితులు ఇక్కడికి భిన్నంగా ఉంటాయి. ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ సమయానికి గాయపడిన ఆసీస్ పేసర్లందరూ తిరిగి జట్టులో కి చేరుతారు. కాబట్టి లండన్‌లో ఆసీస్ పేసర్లు నిప్పులు చేరిగే అవకాశం ఉంది.
అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ క్లీన్‌స్వీప్ విజయం.. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో కూడా ఆసీస్‌ను ఓడిస్తామన్న నమ్మకం ఇస్తుంది" అని ఐసీసీకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్స్ పట్టిక ప్రకారం ఫైనల్లో ఆసీస్, భారత్ తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక వేళ చివరి రెండు టెస్టుల్లో భారత్ ఓడి.. న్యూజిలాండ్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక విజయం సాధిస్తే అప్పుడు లంకేయులు ఫైనల్‌కు చేరే ఛాన్స్ ఉంది.
చదవండి: Team india: హెడ్ కోచ్‌గా ద్రవిడ్ వద్దు.. వారిద్దరే సరైనోళ్లు! సెహ్వాగ్ అయితే?
Comments
Please login to add a commentAdd a comment