Photo Credit: Twitter
ఆసియా క్రీడల ప్రారంభానికి ముందే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయంతో ఆసియా గేమ్స్ నుంచి వైదొలిగితే, తాజాగా అథ్లెటిక్ బృందంలో కీలక అథ్లెట్ అయిన అభిషేక్ పాల్ గేమ్స్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. అభిషేక్ నిషేధిత పదార్థం తీసుకున్నట్లు తేలడంతో జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (నాడా) అతడికి నోటీసులు జారీ చేసింది.
నిషేధిత పదార్థం తీసుకోవడం వెనుక కారణమేంటన్నది వెల్లడించాలని అభిషేక్‌ను నాడా కోరింది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు ఎంపికైన 72 మంది బృందంలో ఒకడైన అభిషేక్ పాల్ ఒకడు. మారథాన్ రన్నరైన అతడు 5,000 మీటర్లు, 10,000 మీటర్ల పరుగులో బరిలోకి దిగనున్నాడు. అయితే తాజాగా నిషేధిత పదార్థం తీసుకున్నట్లు తేలినప్పటికీ, అది మోతాదులోనే ఉన్నప్పటికీ కూడా నాడా నోటీసులు జారీ చేయడం ఆసక్తి కలిగించింది.
‘‘అభిషేక్‌కు డోపింగ్ టెస్ట్ నిర్వహించాం. అతడి రక్త నమూనాల్లో నిషేధిత పదార్ధం కొద్ది మొత్తంలో కనిపించింది. సంతానం కోసం మహిళలు ఉపయోగించే ఫర్టిలిటీ డ్రగ్ అది. అందుకని.. ఆ పదార్థం తన నమూనాల్లో ఉండడం అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకే అతడికి నోటీసులు పంపించాం’’ అని నాడా తెలిపింది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారథాన్ రన్నర్‌గా రాణిస్తున్న అభిషేక్ పాల్.. 2023 ఆసియా ఛాంపియన్‌షిప్స్10వేల మీటర్ల పరుగులో కాంస్యంతో మెరిశాడు. జపాన్‌లోని ఐచీ – నగోయ వేదికగా సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఆసియా క్రీడలు మొదలవ్వనున్నాయి.


