అరంగేట్రంలోనే డకౌటై విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ.. 24 గంటల వ్యవధిలోనే సంచలనం సృష్టించాడు. ఎక్కడైతే డకౌటయ్యాడో అక్కడే సెంచరీతో సత్తా చాటి శెభాష్ అనిపించుకుంటున్నాడు.
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. జింబాబ్వే బౌలర్లను అభిషేక్ ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. తద్వారా అతి తక్కువ ఇన్నింగ్స్‌లో తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ అందుకున్న భారత ప్లేయర్‌గా అభిషేక్ నిలిచాడు.
ఇక మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన అభిషేక్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో ఆడలేదంట. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో ఈ అద్భుత నాక్ ఆడినట్లు అభిషేక్ తెలిపాడు.
"ఓ విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ మ్యాచ్‌లో నేను శుబ్‌మన్ గిల్ బ్యాట్‌తో ఆడాడను. అతడి నుంచి బ్యాట్‌ను తీసుకుని ఆడటం చాలా కష్టం. అతడు తన బ్యాట్‌లను ఎవరికీ అంత ఈజీగా ఇవ్వడు.
కానీ నేను మాత్రం మేము అండర్-14 క్రికెట్ ఆడే రోజుల నుంచి అతడి బ్యాట్‌ను ఉపయోగిస్తునే ఉన్నాను. నేను ఒత్తిడిలో ఉన్న ప్రతీ సారి గిల్‌ను తన బ్యాట్ ఇవ్వమని అడుగుతాను.
నేను అతని బ్యాట్‌తో ఆడినప్పుడల్లా అద్భుతంగా రాణించాను . ఇప్పుడు కూడా అంతే. సరైన సమయంలో గిల్ తన బ్యాట్‌ను నాకు ఇచ్చాడు. నాతో పాటు జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. థంక్యూ గిల్ అంటూ బీసీసీఐ టీవీతో అభిషేక్ పేర్కొన్నాడు. కాగా గిల్, అభిషేక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరూ పంజాబ్ నుంచి భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment