హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన అభిషేక్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సెంచరీ చేసి ఔరా అన్పించాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..
అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా(ఇన్నింగ్స్‌ల పరంగా) తొలి సెంచరీ నమోదు చేసిన మొదటి భారత క్రికెటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. అభిషేక్ శర్మ కేవలం రెండు ఇన్నింగ్స్‌ల వ్యవధిలోనే తన మొదటి అంతర్జాతీయ సెంచరీని అందుకున్నాడు.
ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెటర్ దీపక్ హుడా పేరిట ఉండేది. హుడా తను అరంగేట్రం నుంచి మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో కేవలం తన రెండో ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన అభిషేక్.. హుడా ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున సెంచరీ చేసిన ఐదో అత్యంత పిన్న వయుష్కుడిగా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ 23 ఏళ్ల 307 రోజుల వయస్సులో శర్మ తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ జాబితాలో భారత యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఉన్నాడు. జైశ్వాల్ 21 ఏళ్ల 279 రోజుల వయస్సులో సెంచరీ చేశాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(38 బంతులు) అగ్రస్ధానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్..50 సిక్స్‌లు బాదాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ శర్మ 25 మ్యాచ్‌ల్లో 46 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌తో హిట్‌మ్యాన్‌ను అభిషేక్ అధిగమించాడు.
ఇక జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో భారత్ సమం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment