అండర్-19 ఆసియా కప్‌లో ఒకే రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. పసికూనలైన బంగ్లాదేశ్, యూఏఈల చేతుల్లో మాజీ ఛాంపియన్లు భారత్, పాకిస్తాన్ ఓటమిపాలయ్యాయి. ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో తొలుత యూఏఈ పాకిస్తాన్‌ను మట్టికరిపించగా.. ఆతర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీమిండియాకు షాకిచ్చింది. ఫలితంగా యూఏఈ, బంగ్లాదేశ్ జట్లు ఫైనల్‌కు చేరాయి. దుబాయ్ వేదికగా డిసెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
మ్యాచ్‌ల విషయానికొస్తే.. పాకిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 47.5 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ పేసర్ ఉబెయిద్ షా (4/43) యూఏఈ పతనాన్ని శాశించాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అయాన్ ఖాన్ (55) అర్దసెంచరీతో రాణించగా.. ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ (46), డిసౌజా (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. యూఏఈ బౌలర్లు మూకుమ్మడిగా అటాకింగ్ చేయడంతో 49.3 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సాద్ బేగ్ (50), అజాన్ అవైస్ (41) మాత్రమే రాణించారు. యూఏఈ బౌలర్లలో అయ్మాన్ అహ్మద్, హార్దిక్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రెహ్మాన్, ధృవ్, బదామీ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్.. 42.4 ఓవర్లలో 188 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో ముషీర్ ఖాన్ (50), మురుగన్ అభిషేక్ (62) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్ మరూఫ్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించాడు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్.. అరీఫుల్ ఇస్లాం (94) చెలరేగడంతో 42.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అరీఫుల్‌కు అహ్రార్ అమీన్ (44) సహకరించాడు. నమన్ తివారీ (3/35), రాజ్ లింబానీ (2/47) చివరి వరకు ప్రయత్నించినప్పటికీ టీమిండియాను గెలిపించలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment