ఆస్ట్రేలియాకు కొత్త కోచ్‌ | Adam Griffith Appointed Cricket Australia Pace Bowling Coach | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాకు కొత్త కోచ్‌

Published Fri, Jan 24 2025 11:28 AM | Last Updated on Fri, Jan 24 2025 11:41 AM

Adam Griffith Appointed Cricket Australia Pace Bowling Coach

ఆస్ట్రేలియా పేస్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఆర్సీబీ బౌలింగ్‌ కోచ్‌ ఆడమ్‌ గ్రిఫిత్‌ నియమితుడయ్యాడు. 46 ఏళ్ల గ్రిఫిత్‌ రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌గా ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్‌ (టస్మానియా తరఫున) ఆడాడు. గ్రిఫిత్‌ 2019 నుంచి 2024 వరకు ఆర్సీబీ బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు. గ్రిఫిత్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా దేశవాలీ జట్టు అయిన విక్టోరియాకు అసిస్టెంట్‌ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. గ్రిఫిత్‌.. ఆస్ట్రేలియా జాతీయ జట్టుతో పాటు ఆస్ట్రేలియా-ఏ జట్టుకు కూడా బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

గ్రిఫిత్‌ బ్రిస్బేన్‌లో ఉన్న క్రికెట్‌ ఆస్ట్రేలియా నేషనల్‌ క్రికెట్‌ సెంటర్‌ను ఆపరేట్‌ చేస్తాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది. గ్రిఫిత్‌ పేస్ బౌలర్ల అభివృద్ధి మరియు కొత్త పేస్‌ బౌలర్లను తయారు చేయడంలో భాగమవుతాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. గ్రిఫిత్‌ నియామకాన్ని ఆస్ట్రేలియా హెడ్‌ కోచ్‌ ఆండ్రూ మెక్‌ డొనాల్డ్‌ స్వాగతించాడు. గ్రిఫిత్‌ అనుభవం ఆసీస్‌ పేసర్లను మరింత పదునెక్కించేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.

గ్రిఫిత్‌ తన కోచింగ్‌ కెరీర్‌లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా, పెర్త్‌ స్కార్చర్‌ జట్లకు సీనియర్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా.. టస్మానియా కోచింగ్‌ డైరెక్టర్‌గా.. బీబీఎల్‌ జట్లైన టస్మానియా టైగర్స్‌, హోబర్ట్‌ హరికేన్స్‌ జట్లకు హెడ్‌ కోచ్‌గా పని చేశాడు.

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా జట్టు త్వరలో రెండు టెస్ట్‌లు, రెండు మ్యాచ్‌ వన్డే సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో టెస్ట్‌ జట్టుకు స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ గాయం కారణంగా ఈ పర్యటనకు దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ గాలే వేదికగా జనవరి 29న ప్రారంభం కానుంది. రెండో టెస్ట్‌ ఇదే వేదికగా ఫిబ్రవరి 6 నుంచి మొదలవుతుంది. అనంతరం ఫిబ్రవరి 12, 14 తేదీల్లో రెండు వన్డేలు జరుగనున్నాయి.

ఆస్ట్రేలియా ఇటీవలే స్వదేశంలో భారత్‌తో జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటన అనంతరం ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొంటుంది. మెగా టోర్నీలో ఆసీస్‌ ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. కరాచీలో జరిగే ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. అనంతరం ఫిబ్రవరి 25న సౌతాఫ్రికాతో (రావల్పిండి), ఫిబ్రవరి 28న ఆఫ్ఘనిస్తాన్‌తో (లాహోర్‌) తలపడుతుంది. 

ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆసీస్‌ గ్రూప్‌-బిలో ఉంది. గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో భారత్‌ ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌ను, మార్చి 2న న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement