
ముంబై: 2011 ప్రపంచకప్ సమయంలో టీమిండియా మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరించిన ప్యాడీ అప్టాన్ సంచలన విషయాలను వెల్లడించాడు. తాను రచించిన పుస్తకం 'ద బేర్‌ఫుట్ కోచ్'లో ఈ షాకింగ్ విషయాలను ప్రస్తావించాడు. భారత్‌ను రెండోసారి విశ్వ విజేతగా నిలిపిన ఆ ప్రపంచకప్‌లోని మ్యాచ్‌లకు ముందు టీమిండియా ఆటగాళ్లను సెక్స్ చేయాల్సిందిగా సూచించినట్లు పేర్కొన్నాడు. అయితే తాను ఇచ్చిన ఈ సలహాకు నాటి హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ అవాక్కయ్యాడని తెలిపాడు. ఆతర్వాత తన సలహా సరైంది కాదని భావించి క్షమాపణలు కోరినట్లు ప్యాడీ అప్టాన్ ప్రస్తావించాడు.
అంతకుముందు 2009 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా తాను ప్లేయర్స్ కోసం నోట్స్ సిద్ధం చేశానని, అందులో సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలను సవివరంగా రాశానని దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మానసిక నిపుణుడు చెప్పాడు. కాగా, గేమ్‌కు ముందు సెక్స్ చేయడం వల్ల ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయగలరా అంటే కచ్చితంగా అవుననే అంటున్నాడు అప్టాన్. దీంతో పాటు రాహుల్ ద్రవిడ్‌ను శ్రీశాంత్ తిట్టడం, ధోనీ కెప్టెన్సీపై నాటి జట్టులో భిన్నాభిప్రాయాలు తదితర ఆసక్తికర అంశాలను ఆయన తన పుస్తకంలో ప్రస్తావించాడు. ఇదిలా ఉంటే, నాటి టీమిండియా కోచ్ గ్యారీ కిర్‌స్టెన్.. ప్యాడీ అప్టాన్‌ను పట్టుపట్టి మరీ మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా అపాయింట్ చేసుకున్నాడు.
వీరిద్దరు కోచ్‌లుగా వ్యవహరిస్తుండగా ధోనీ హయాంలో టీమిండియా 28 ఏళ్ల తర్వాత రెండోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. నాటి ప్రపంచకప్‌లో టీమిండియా కేవలం ఒక్క మ్యాచ్‌లో(దక్షిణాఫ్రికా) మాత్రమే ఓటమి చవిచూసింది. లీగ్ దశలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం క్వార్టర్స్‌లో నాటి డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్‌కు షాక్ ఇచ్చిన ధోని సేన.. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్ధి పాక్‌కు మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. తర్వాత తుది పోరులో పట్టిష్టమైన శ్రీలంకకు షాకిచ్చి రెండోసారి జగజ్జేతగా అవతరించింది.
Comments
Please login to add a commentAdd a comment