‘ఏంటిది? నేను అవుటయ్యానా?’.. జాన్సన్‌ దెబ్బకు రహ్మనుల్లా బౌల్డ్‌ | AFG vs AUS: Spencer Johnson Cleans up Rahmanullah Duck With Stunning Yorker Watch | Sakshi
Sakshi News home page

‘ఏంటిది? నేను అవుటయ్యానా?’.. జాన్సన్‌ దెబ్బకు రహ్మనుల్లా బౌల్డ్‌

Published Fri, Feb 28 2025 4:11 PM | Last Updated on Fri, Feb 28 2025 4:51 PM

AFG vs AUS: Spencer Johnson Cleans up Rahmanullah Duck With Stunning Yorker Watch

అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌(Spencer Johnson) అద్బుతం చేశాడు. నమ్మశక్యం కాని రీతిలో రహ్మనుల్లా గుర్బాజ్‌(Rahmanullah Gurbaz)ను బౌల్డ్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్‌ ప్రేమికులకు కనువిందు చేస్తోంది. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా అఫ్గన్‌- ఆసీస్‌(Afghanistan vs Australia) శుక్రవారం లాహోర్‌ వేదికగా అమీతుమీ తేల్చుకుంటున్నాయి.

నమ్మశక్యం కాని డెలివరీ
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా నేరుగా గ్రూప్‌-‘బి’ నుంచి సెమీస్‌లో అడుగుపెడుతుంది. అందుకే ఇరుజట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. ఇక గడాఫీ స్టేడియంలో టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఆసీస్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించాడు.

ఈ క్రమంలో అఫ్గన్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో ఐదో బంతికే జాన్సన్‌ అద్బుత రీతిలో రహ్మనుల్లా గుర్బాజ్‌ను బౌల్డ్‌ చేశాడు. నమ్మశక్యం కాని డెలివరీతో అతడిని పెవిలియన్‌కు పంపాడు. 

గంటకు 140.7 కిలోమీటర్ల వేగంతో జాన్సన్‌ సంధించిన బంతిని గుర్బాజ్‌ తప్పుగా అంచనా వేశాడు. స్వింగ్‌ అవుతున్న బాల్‌ను ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

ఏంటిది? నేను అవుటయ్యానా?
ఈ క్రమంలో బ్యాట్‌ కిందుగా వెళ్లిన బంతి ఆఫ్‌ స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో గుర్బాజ్‌.. ‘‘ఏంటిది? నేను అవుటయ్యానా?.. నమ్మలేకపోతున్నా’’ అన్నట్లుగా ఇచ్చిన షాకింగ్‌ రియాక్షన్‌ వైరల్‌ అయింది. 

మరోవైపు.. జాన్సన్‌ సహచర సభ్యులతో కలిసి తొలి వికెట్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నాడు. కాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో అఫ్గనిస్తాన్‌ ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌లలో అతడు వరుసగా 10, 6 పరుగులు చేశాడు. తాజాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఐదు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు.

సెమీస్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌
ఇదిలా ఉంటే.. ఈ వన్డే టోర్నమెంట్లో ఇప్పటికే రెండు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. గ్రూప్‌-‘ఎ’ నుంచి టీమిండియా, న్యూజిలాండ్‌ టాప్‌-4కు అర్హత సాధించాయి. ఈ రెండు జట్లు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లను టోర్నీ నుంచి నాకౌట్‌ చేశాయి. ఇక గ్రూప్‌-‘బి’లో సౌతాఫ్రికా సెమీస్‌ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 

తమ తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసిన ప్రొటిస్‌ జట్టు రెండు పాయింట్లతో పాటు నెట్‌ రన్‌రేటు(+2.140) పరంగా అదరగొట్టింది. అయితే, ఆసీస్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కావడంతో మరో పాయింట్‌ సౌతాఫ్రికా ఖాతాలో చేరింది.

చాంపియన్స్‌ ట్రోఫీ-2025: అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా తుదిజట్లు
అఫ్గనిస్తాన్‌
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిది(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బదిన్‌ నాయిబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.

ఆస్ట్రేలియా
మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ లబుషేన్‌, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ(వికెట్‌ కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.

చదవండి: IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్‌ దూరం.. కెప్టెన్‌గా అతడు!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement