ఓపెనర్లుగా బాబాయ్‌-అబ్బాయ్‌.. ఒకరు హిట్టు, ఒకరు ఫట్టు | Afghanistan All Out For 155 Runs In Only Test Against Ireland | Sakshi
Sakshi News home page

ఓపెనర్లుగా బాబాయ్‌-అబ్బాయ్‌.. ఒకరు హిట్టు, ఒకరు ఫట్టు

Published Wed, Feb 28 2024 4:28 PM | Last Updated on Wed, Feb 28 2024 7:39 PM

Afghanistan All Out For 155 Runs In Only Test Against Ireland - Sakshi

ఆఫ్ఘనిస్తాన్‌-ఐర్లాండ్‌ జట్ల మధ్య అబుదాబీ వేదికగా ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 28) ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన బాబాయ్‌-అబ్బాయ్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అబ్బాయ్‌ ఇబ్రహీం జద్రాన్‌ (53) అర్దసెంచరీతో రాణించగా.. బాబాయ్‌ నూర్‌ అలీ జద్రాన్‌ 7 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. బాబాయ్‌-అబ్బాయ్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఇది తొలిసారి కాదు. కొద్ది రోజుల శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఈ ఇద్దరు కలిసి ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. 

ఆ మ్యాచ్‌ బాబాయ్‌ నూర్‌ అలీ జద్రాన్‌కు అరంగేట్రం మ్యాచ్‌ కాగా.. అబ్బాయ్‌ ఇబ్రహీం జద్రాన్‌కు అప్పటికే ఐదు మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. 35 ఏళ్ల వయసున్న బాబాయ్‌ నూర్‌ అలీ.. 22 ఏళ్ల అబ్బాయ్‌ ఇ‍బ్రహీం చేతుల మీదుగా టెస్ట్‌ అరంగేట్రం క్యాప్‌ను అందుకున్నాడు. 

కాగా, ఇబ్రహీం బాబాయ్‌ నూర్‌ అలీ లేటు వయసులో టెస్ట్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. అతని అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడో 15 ఏళ్ల కిందటే జరిగింది. నూర్‌ అలీ 2009లోనే వన్డే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్‌ పరిమిత ఓవర్ల జట్టులో నూర్‌ అలీ రెగ్యులర్‌ సభ్యుడు.

నూర్‌ అలీ ఇప్పటివరకు 51 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. ఇతను వన్డేల్లో సెంచరీ, ఏడు అర్ధసెంచరీల సాయంతో 1216 పరుగులు.. టీ20ల్లో 4 అర్దసెంచరీల సాయంతో 586 పరుగులు చేశాడు. మరోవైపు అబ్బాయి ఇబ్రహీం జద్రాన్‌ ఇప్పటివరకు 6 టెస్ట్‌లు, 28 వన్డేలు, 30 టీ20లు ఆడి 5 సెంచరీలు, 13 అర్దసెంచరీల సాయంతో దాదాపు 2500 పరుగులు చేశాడు. ఇబ్రహీం తన కెరీర్‌లో చేసిన ఐదు సెంచరీలు వన్డేల్లో చేసినవే కావడం విశేషం.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులకే ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్‌ చేసిన 53 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోర్‌గా ఉంది. ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ కరీం జనత్‌ (41 నాటౌట్‌), కెప్టెన్‌ హష్మతుల్లా షాహీది (20), నవీద్‌ జద్రాన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

ఐదేసిన అదైర్‌..
రహ్మత్‌ షా (0), రహ్మానుల్లా గుర్బాజ్‌ (5), నసీర్‌ జమాల్‌ (0), జియా ఉర్‌ రెహ్మాన్‌ (6), నిజత్‌ మసూద్‌ (0), జహీర్‌ ఖాన్‌ (0) దారుణంగా విఫలమయ్యారు. మార్క్‌ అదైర్‌ (5/39) ఆఫ్ఘనిస్తాన్‌ పతనాన్ని శాశించగా.. కర్టిస్‌ క్యాంఫర్‌, క్రెయిగ్‌ యంగ్‌ తలో 2 వికెట్లు, బ్యారీ మెక్‌కార్తీ ఓ వికెట్‌ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్లు కావడం మరో విశేషం.  

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఐర్లాండ్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. పీటర్‌ మూర్‌ (12), ఆండ్రూ బల్బిర్నీ (2), కర్టిస్‌ క్యాంఫర్‌ (49), వాన్‌ వోర్కమ్‌ (1) ఔట్‌ కాగా.. హ్యారీ టెక్టార్‌ (32), పాల్‌ స్టిర్లింగ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో నవీద్‌ జద్రాన్‌, జియా ఉర్‌ రెహ్మాన్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement