టాపార్డర్ బ్యాటర్ ఇహ్సనుల్లా జనత్‌పై ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఐదు సంవత్సరాల పాటు అతడిని అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు పేర్కొంది.
కాగా 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఇహ్సనుల్లా జనత్.. అఫ్గన్ తరఫున ఇప్పటి వరకు మూడు టెస్టులు, 16 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. 26 ఏళ్ల ఈ టాపార్డర్ బ్యాటర్.. టెస్టుల్లో 110, వన్డేల్లో 307, టీ20లో 20 పరుగులు సాధించాడు. ఎంత వేగంగా జాతీయ జట్టులోకి వచ్చాడో అంతే వేగంగా దూరమయ్యాడు కూడా!
ఈ క్రమంలో 2022లో చివరి అంతర్జాతీయ మ్యాచ్(టీ20) ఆడిన ఇహ్సనుల్లా.. ఇటీవల కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో భాగయ్యాడు. 2024 సీజన్‌లో షంషాద్ ఈగల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. నాలుగు ఇన్నింగ్స్ ఆడి 72 పరుగులు చేశాడు. అయితే, అతడు ఫిక్సింగ్ పాల్పడ్డాడన్న ఆరోపణలు రాగా.. క్రికెట్ బోర్డు విచారణ చేపట్టింది.
ఈ క్రమంలో ఇహ్సనుల్లా జనత్ దోషిగా తేలాడు. తన తప్పును అంగీకరించాడు. ఈ క్రమంలో ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిలోని 2.1.1 నిబంధనను ఉల్లంఘించిన కారణంగా అతడిపై ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు అఫ్గన్ బోర్డు తెలిపింది. మ్యాచ్ ఫలితాలు, మ్యాచ్ సాగే తీరును ప్రభావితం చేసే చర్యలకు పాల్పడ్డందుకు వేటు వేసినట్లు పేర్కొంది.
కాగా అఫ్గనిస్తాన్ మాజీ కెప్టెన్ నవ్రోజ్ మంగల్ తమ్ముడే ఇహ్సనుల్లా. అఫ్గన్ జట్టుకు వన్డే హోదా వచ్చినపుడు నవ్రోజ్ సారథిగా ఉన్నాడు. అతడి కెప్టెన్సీలోనే టీ20 ప్రపంచకప్-2010 ఎడిషన్‌కు అఫ్గనిస్తాన్ జట్టు అర్హత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment