టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో తాను భాగం కానున్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత కూడా ఆటగాడిగా కొనసాగే అవకాశం టీ20 లీగ్‌ల ద్వారా దక్కిందని.. మరోసారి మైదానంలో దిగి అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీకే వెల్లడించాడు.
ఇటీవలే రిటైర్మెంట్
కాగా ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ఈ చెన్నై క్రికెటర్.. సీజన్ ముగిసిన తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు డీకే ఈ ఏడాది జూన్ 1న ప్రకటన విడుదల చేశాడు. అనంతరం సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్‌తో జట్టు కట్టిన దినేశ్ కార్తిక్.. ఈ లీగ్‌లో ఆడనున్న భారత తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఆ జట్టులో చేరిన డీకే
ఇక తాజాగా లెజెండ్స్ లీగ్‌లోనూ పాల్గొనన్నుట్లు తెలిపాడు. ఈ టీ20 లీగ్‌లో సదరన్ సూపర్‌స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నట్లు మంగళవారం వెల్లడించాడు. అభిమానుల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నానని.. తనలో ఆడగల సత్తా ఉన్నంత కాలం క్రికెటర్‌గా కొనసాగుతానని డీకే పేర్కొన్నాడు. మైదానంలో దిగేందుకు శారీరకంగా, మానసికంగా సన్నద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు.
కాగా 2004 నుంచి 2022 వరకు టీమిండియాకు ఆడిన దినేశ్ కార్తిక్.. 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లలో భాగమయ్యాడు. టెస్టుల్లో 1025, వన్డేల్లో 1752, టీ20లలో 686 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 257 మ్యాచ్‌లు ఆడి 4842 రన్స్ స్కోరు చేశాడు.
ఇక శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం తాను లెజెండ్స్ లీగ్‌లో పాల్గొననున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గబ్బర్ సోమవారం ప్రకటించాడు.
తాజాగా డీకే సైతం ఇదే బాటలో నడవడం విశేషం. ఈ లీగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, క్రిస్ గేల్,ఆరోన్ ఫించ్ తదితర మాజీ క్రికెటర్లు ఇప్పటికే భాగమయ్యారు. కాగా సెప్టెంబరు 29న లెజెండ్స్ లీగ్ వేలం జరుగనుంది. ఇందులో 200కు పైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment