సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలకు అదుపులేకుండా పోతోంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు డీప్‌ఫేక్ బారిన పడగా.. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా తాజాగా ఆ బాధితుల జాబితాలో చేరాడు.
ఓ గేమింగ్ అప్లికేషన్‌ను సచిన్ ప్రమోట్ చేస్తున్నట్లుగా నకిలీ వీడియోను రూపొందించి నెట్టింట వదిలారు సైబర్ నేరాలకు అలవాటు పడ్డ మాయగాళ్లు. ఇది కాస్తా తన వరకు చేరడంతో.. ఎక్స్ వేదికగా స్పందించాడీ బ్యాటింగ్ లెజెండ్.
ఇవన్నీ నకిలీ వీడియోలు
‘‘ఈ వీడియోలు నకిలీవి. టెక్నాలజీని ఇంతలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే మనసు కలచివేస్తోంది. ఇలాంటి వీడియోలు, యాడ్స్, అప్లికేషన్లు గనుక మీ దృష్టికి వస్తే ప్రతి ఒక్కరు తప్పక రిపోర్టు చేయండి’’ ని సచిన్ టెండుల్కర్.. తన ఫాలోవర్లకు సూచించాడు.
అదే విధంగా.. ‘‘ఇలాంటి ఫిర్యాదుల పట్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా వేగంగా స్పందించి సత్వరమే చర్యలు తీసుకోవాలి. డీప్‌ఫేక్స్, తప్పు సమాచారవ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి’’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్లకు విజ్ఞప్తి చేశాడు సచిన్ టెండుల్కర్.
గిల్‌తో ఉన్నట్లుగా ఫొటో మార్ఫ్ చేసి
కాగా సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ కూడా డీప్‌ఫేక్ బారిన పడిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోను సృష్టించారు. తన తమ్ముడు అర్జున్ టెండుల్కర్‌తో సారా దిగిన ఫొటోను మార్ఫ్ చేసి లీక్ చేశారు.
అంతేకాదు ఆమె పేరిట ఫేక్ అకౌంట్లు సృష్టించి గిల్ పట్ల ప్రేమను చాటుకుంటున్నట్లుగా పోస్టులు పెట్టారు. ఈ విషయంపై స్పందించిన సారా టెండుల్కర్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎక్స్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment