India All Rounder Yusuf Pathan Announces Retirement From All Forms Of Cricket - Sakshi
Sakshi News home page

ఆటకు గుడ్‌బై చెప్పిన యూసఫ్‌ పఠాన్‌

Published Fri, Feb 26 2021 5:05 PM | Last Updated on Fri, Feb 26 2021 7:40 PM

All Rounder Yusuf Pathan Announces Retirement From All Forms Of Cricket  - Sakshi

ముంబై: టీమిండియా వెటరన్‌ ఆల్‌రౌండర్‌ యూసఫ్‌ పఠాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్లకు శుక్రవారం గుడ్‌ బై చెప్పాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపాడు. ‘‘ఈరోజుతో అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పా. ఇంతకాలం నా వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులకు, స్పేహితులకు, అభిమానులకు, కోచ్‌లకు.. దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అంటూ పేర్కొన్నాడు.

కాగా పఠాన్‌ బ్రదర్స్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బరోడా ఆల్‌రౌండర్‌ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా తరపున 57 వన్డేల్లో 810 పరుగులు.. 22 టీ20ల్లో 232 పరుగులు చేశాడు. వన్డేల్లో 2 సెంచరీలు.. 5 అర్థ సెంచరీలు చేసిన యూసఫ్‌ పఠాన్‌ మంచి పవర్‌ హిట్టర్‌గా పేరు పొందాడు. టీమిండియా తరపున ఎక్కువసార్లు ఫినిషర్‌గా ఆడిన యూసఫ్‌ పఠాన్‌ 2012 తర్వాత మళ్లీ టీమిండియా జట్టులోకి రాలేకపోయాడు.

లేటు వయసులో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యూసఫ్‌ కెరీర్‌లో కొన్ని మొమరబుల్‌ ఇన్నింగ్స్‌ ఉన్నాయి. 2010లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో యూసఫ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. 4వ వన్డేలో 129 పరుగుల నాటౌట్‌ ఇన్నింగ్స్‌తో పాటు బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. 2011 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో 70 బంతుల్లోనే 105 పరుగులు చేయడంతో ఆల్‌రౌండర్‌ కోటాలో 2011 ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాధించాడు. టీమిండియా సాధించిన 2007 టీ20, 2011 ప్రపంచకప్‌లో పఠాన్‌ భాగస్వామ్యం కావడం అతని కెరీర్‌లో మరిచిపోలేనివిగా చెప్పొచ్చు.

అయితే ప్రపంచకప్‌ తర్వాత పఠాన్‌ కెరీర్‌ గ్రాఫ్‌ పడిపోవడంతో పాటు.. సెలెక్టర్లు కూడా అతని పేరు పరిగణలోకి తీసుకోకపోవడంతో క్రమంగా జట్టు నుంచి దూరమయ్యాడు. అలా పఠాన్‌ కెరీర్‌ టీమిండియాలో ముగిసిందనే చెప్పొచ్చు. ఇక ఐపీఎల్‌ అరంగేట్రం సీజన్‌ 2008లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున ఆడి టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత సీజన్లలోనూ యూసఫ్‌ పఠాన్‌ కేకేఆర్‌, పుణే వారియర్స్‌, సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో చివరిసారి ఐపీఎల్‌లో పాల్గొన్న యూసఫ్‌ను ఆ తర్వాత సీజన్‌కు వేలంలోకి వచ్చినా ఎవరు అతన్ని తీసుకోవడానికి ముందుకు రాలేదు. తాజాగా ఈ బుధవారం(ఫిబ్రవరి 24న) హైదరాబాద్‌కు వచ్చిన యూసఫ్‌ పఠాన్‌ పఠాన్‌ క్రికెట్‌ అకాడమీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు వినయ్‌ కుమార్‌ గుడ్‌బై

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement