![Am At That Stage Now: Bhuvneshwar Kumar On Final Years Of Being Fast Bowler - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/6/bhuvneshwar-kumar.jpg.webp?itok=xKJRpq3p)
Bhuvneshwar Kumar Comments: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు జట్టులో ప్రాధాన్యం లేకుండా పోయింది. గతేడాది నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో అతడు ఆఖరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
వరుస వైఫల్యాల నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా అతడిని తప్పించింది బీసీసీఐ. ఈ క్రమంలో 33 ఏళ్ల భువీకి గత కొంతకాలంగా జట్టులో చోటు కరువైంది. ఈ నేపథ్యంలో ఈ యూపీ సీమర్ లీగ్ క్రికెట్‌కే పరిమితమయ్యాడు.
ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న భువనేశ్వర్ కుమార్.. తాజా ఎడిషన్‌లో 14 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడు యూపీ టీ20 లీగ్‌తో బిజీగా ఉన్నాడు. స్థానికంగా జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నీలో భువీ ప్రాతినిథ్యం వహిస్తున్న నోయిడా సూపర్ కింగ్స్ టాప్‌లో కొనసాగుతోంది.
భువీ(PC: SRH)
ఈ నేపథ్యంలో నేషనల్‌న్యూస్‌తో మాట్లాడిన భువనేశ్వర్ కుమార్ జాతీయ జట్టులో పునరాగమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్‌బౌలర్‌గా తన అంతర్జాతీయ కెరీర్ చరమాంకానికి చేరిందన్న ఈ రైట్‌ఆర్మ్ పేసర్... ఇప్పుడు తన దృష్టంతా కేవలం ఆటను ఆస్వాదించడం మీదే ఉందని పేర్కొన్నాడు.
కెరీర్ చరమాంకంలో ఉన్నాను
‘‘మన కెరీర్ ఎలా సాగుతుందన్న విషయం మనసు మనకు గుర్తుచేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అదే స్టేజ్‌లో ఉన్నాను. కొన్నేళ్లపాటు మాత్రమే ఫాస్ట్‌బౌలర్‌గా మనగలను. అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.
అయినా ఆ విషయం నన్ను బాధించడం లేదు. రీఎంట్రీ ఇచ్చేందుకు నేను ఇవన్నీ చేయడం లేదు. ఇంకొన్నాళ్ల పాటు నాణ్యమైన క్రికెట్ ఆడాలని మాత్రమే కోరుకుంటున్నా. ఈ క్రమంలో ఒకవేళ జాతీయ జట్టులో స్థానం దక్కితే దక్కొచ్చు.
ఇకపై నా దృష్టి మొత్తం దానిమీదే
అంతేగానీ.. ప్రత్యేకంగా తిరిగిరావడం కోసమే నేను ఈ ప్రయత్నాలు చేయడం లేదు. ఏ ఫార్మాట్‌లో అయినా.. ఎలాంటి లీగ్ ఆడుతున్నా మెరుగైన ప్రదర్శనలు ఇవ్వడం మీదే నా దృష్టి ఉంది’’ అని భువీ చెప్పుకొచ్చాడు. ఇకపై తాను లీగ్ క్రికెట్‌పై మరింతగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
కాగా భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 63, 141, 90 వికెట్లు తీశాడు.
లోకల్ టాలెంట్ వెలుగులోకి
యూపీ వంటి రాష్ట్రంలో ఇలాంటి లీగ్‌లు స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. కాగా ఆరు జట్ల మధ్య పోటీతో ఆగష్టు 30న యూపీ టీ20 లీగ్ ఆరంభమైంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా..
Comments
Please login to add a commentAdd a comment