ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకంతో మెరిశాడు. 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన అమన్ సెమీస్‌లో ఓడినా.. కాంస్య పతక పోరులో మాత్రం అదరగొట్టాడు.
ప్రత్యర్ధి క్రజ్ డెరియన్ (పూర్టోరికో)ను 13-5తో ఓడించిన అమన్.. తొలి ఒలింపిక్ పతకాన్ని ముద్దాడాడు. తద్వారా ఒలిపింక్స్‌లో భారత తరపున పతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా అమన్ చరిత్ర సృష్టించాడు.
కాంస్యం వెనక కఠోర శ్రమ..
అయితే అమన్ సెహ్రావత్ కాంస్య పతకం సొంతం చేసుకోవడం వెనక కఠోర శ్రమ దాగింది. అమన్ తృటిలో ఆనర్హత వేటును తప్పించుకున్నాడు. అమన్ కాంస్య పతక మ్యాచ్‌కు ముందు భారత రెజ్లింగ్ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
అమన్ బరువు(57 కేజీలు) ఉండాల్సిన కంటే 4.5 కేజీలు ఆధికంగా ఉండటమే అందుకు కారణం . సెమీస్‌లో ఓటమి తర్వాత గురువారం(ఆగస్టు 8) నాడు సాయంత్రం 6: 30 గంటలకు అమన్ బరువు 61.5 కేజీలు ఉందట. ఇప్పటికే స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై ఆధిక బరువు కారణంగా అనర్హత వేటు పడినందున.. అమన్ విషయంలో మాత్రం భారత మేనేజ్‌మెంట్ జాగ్రత్తలు తీసుకుంది.
దీంతో కాంస్య పతక పోరుకు ముందు బరువు తూచే సమయానికి అమన్ 4.6 కిలోల బరువు తగ్గాల్సి ఉంది. ఈ క్రమంలో అమన్ తన బరువు తగ్గడానికి కఠినంగా శ్రమించాడు. గురువారం రాత్రి మొత్తం అమన్ నిద్ర పోలేదు. హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. కోచ్‌లు వీరేంద్ర దహియా, జగ్మందర్ సింగ్ సెహ్రావత్ బరువు తగ్గించడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు.
అమన్ మిషన్ సాగింది ఇలా..
తొలుత ఇద్దరు కోచ్‌లతో గంటన్నర సుదీర్ఘ మ్యాట్ సెషన్‌తో అమన్ వెయిట్ లాస్ మిషన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ యువ రెజ్లర్ ఒక గంట పాటు హాట్ బాత్(వేడి నీళ్ల స్నానం) సెషన్‌లో పాల్గోన్నాడు.
అనంతరం అర్ధరాత్రి దాటాక జిమ్‌లో 30 నిమిషాల నాన్‌స్టాప్ ట్రెడ్‌మిల్‌పై సాధన చేశాడు. ఆ తర్వాత అతడికి 30 నిమిషాల పాటు విరామం ఇచ్చారు. బ్రేక్ తర్వాత దాదాపు ఐదు సెషన్లపాటు ఐదేసి నిమిషాల చొప్పున సానా బాత్( ఆవిరి స్నానం) చేయించారు.
అప్పటికి అతడు 3.6 కిలోలు తగ్గాడు. కానీ అమన్‌పై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు మరింత బరువు తగ్గాల్సి ఉంది. ఈ క్రమంలో అతడికి మసాజ్ సెషన్ నిర్వహించారు. ఆ తర్వాత లైట్ జాగింగ్, 15 నిమిషాల రన్నింగ్ సెషన్‌లో పాల్గోన్నాడు. సరిగ్గా ఉదయం 4:30 గంటలకు అతని బరువు 4.6 కేజీల తగ్గి 56.9 కిలోలకు వచ్చింది. దీంతో భారత బృందం ఊపిరిపీల్చుకుంది.
దాదాపు 10 గంటల పాటు తీవ్రంగా శ్రమించి అమన్ తన బరువును తగ్గించుకున్నాడు. శుక్రవారం మ్యాచ్ జరిగే ముందు బరువు తూచే సమయానికి అమన్ సరిగ్గా 56.9 కిలోల బరువు ఉన్నాడు. దీంతో మ్యాచ్‌లో పాల్గోని కాంస్య పతకాన్ని భారత్‌కు అందించాడు. ఈ క్రమంలో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా నీవు వారియర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment