
ఐపీఎల్‌లో ధోని తర్వాత చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరన్న విషయంపై చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే వచ్చే ఏడాది సీజన్‌లో ధోని ఆడుతాడో లేదో కచ్చితంగా తెలియదు. వచ్చే సీజన్‌లో ఆడేది, ఆడకపోవడం తన ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని ఐపీఎల్-2023 ఫైనల్ అనంతరం మిస్టర్ కూల్ సృష్టం చేశాడు.
ఈ నేపథ్యంలో సీఎస్‌కే తదుపరి కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్ అవుతాడని ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు జోస్యం చెప్పాడు. "రుత్‌రాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడు. అదే విధంగా అతడికి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. నాకు తెలిసి మహీ బాయ్ మరో సీజన్ ఆడుతాడు. కాబట్టి భవిష్యత్తులో రుత్‌రాజ్ కచ్చితంగా చెన్నై సారధి అవుతాడు. అతడు 7 నుంచి 8 ఏళ్ల పాటు సీఎస్‌కేకు కెప్టెన్‌గా ఉండగలడు. రుతు ఇప్పటికే ధోని, హెడ్‌కోచ్ ఫ్లెమింగ్ నేతృత్వంలో రాటుదేలాడు.
ఇక అతడు భారత జట్టు తరపున కూడా అన్ని ఫార్మాట్‌లలో అదరగొడతాడు. కానీ జట్టు మెనెజ్‌మెంట్ కూడా తగినన్ని అవకాశాలు ఇవ్వాలి" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు.కాగా రుత్‌రాజ్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నాడు. విండీస్‌తో టెస్టు, వన్డే జట్టులో రుత్‌రాజ్‌కు చోటు దక్కింది. కానీ టెస్టు సిరీస్‌లో మాత్రం అతడికి ఆడే అవకాశం రాలేదు.
చదవండి: Deodhar Trophy 2023: క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్