
ఖతర్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన అమెరికా స్టార్
కెరీర్‌లో తొలిసారి డబ్ల్యూటీఏ 1000 టైటిల్ సొంతం
దోహా: ఎనిమిదేళ్ల క్రితం మహిళల టెన్నిస్‌లో భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా ప్లేయర్ అమండా అనిసిమోవా ఎట్టకేలకు తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. గ్రాండ్‌స్లామ్ తర్వాత రెండో అత్యున్నత శ్రేణి అయిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) 1000 సిరీస్ టోర్నీలో ఆమె మొదటిసారి విజేతగా అవతరించింది. ఖతర్ ఓపెన్‌లో 23 ఏళ్ల అనిసిమోవా చాంపియన్‌గా నిలిచింది.
దోహాలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 41వ ర్యాంకర్ అనిసిమోవా 6–4, 6–3తో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచింది. అనిసిమోవాకు 5,97,000 డాలర్ల (రూ. 5 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2002లో మోనికా సెలెస్ తర్వాత ఖతర్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన రెండో అమెరికా ప్లేయర్‌గా అనిసిమోవా గుర్తింపు పొందింది.
ఈ గెలుపుతో అనిసిమోవా నేడు విడుదలయ్యే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్‌ను అందుకుంటుంది. ఓవరాల్‌గా అనిసిమోవా కెరీర్‌లో ఇది మూడో సింగిల్స్ టైటిల్. 2019లో బొగోటా ఓపెన్‌లో, 2022లో మెల్‌బోర్న్ ఓపెన్‌లో ఆమె టైటిల్స్ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment