
న్యూఢిల్లీ: 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం కోసం ప్రయత్నించాలని భారత వెయిట్‌లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చానును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. శనివారం న్యూఢిల్లీలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ 51వ రైజింగ్ డే వేడుకల్లో మీరాబాయిని అమిత్ షా సన్మానించారు.
మీరాబాయి కష్టానికి, నిబద్ధతకు పతకం రూపంలో టోక్యోలో ప్రతిఫలం లభించింది. దేశంలో ప్రధాని నుంచి సామాన్యుడి వరకు కూడా ఆమె ఘనతను కొనియాడారు. ఆమెకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. వచ్చే ఒలింపిక్స్‌లో పసిడి కోసం ప్రయత్నించాలని కోరుతున్నాను. దేశమంతా ఆ క్షణం కోసం ఎదురుచూస్తోంది’ అని అమిత్ షా అన్నారు.