విజయనగరం/విజయనగరం రూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించి చరిత్రలో నిలిచిపోవాలని రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా ఆకాంక్షించారు. జిల్లా కేంద్రం శివారు డెంకాడ మండలం చింతలవలసలోని డాక్టర్ పీవీజీ రాజు నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో ఆంధ్రా క్రికెట్ అసొసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి మహిళా టీ–20 లీగ్ నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన ఫైనల్ పోటీలకు మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లీగ్ విజేతగా నిలిచిన విజయనగరం రాయల్స్ జట్టుకు రూ.5 లక్షల చెక్కు, ట్రోఫీ అందజేశారు.
రన్నరప్‌గా నిలిచిన వైజాగ్ డాల్ఫిన్స్ జట్టుకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేతుల మీదుగా రూ. 3 లక్షల చెక్కు, ట్రోఫీని అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రోజా మాట్లాడుతూ మహిళలు ఇతర రంగాలతో పాటు క్రీడల్లోనూ పాల్గొనడం అభినందనీయమని ప్రశంసించారు. ఆటలకు ఆడపిల్లలు వద్దనకుండా వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మహిళా క్రికెటర్లకు ఇంత మంచి వేదిక కల్పించిన ఆంధ్రా క్రికెట్ అసొసియేషన్ (ఏసీఏ) పేరు ఆదర్శ క్రికెట్ అసోసియేషన్‌గా మారాలని ఆకాంక్షించారు. మహిళా పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పురుషులతో పాటు మహిళలకు ప్రత్యేకంగా లీగ్ నిర్వహించాలన్న సూచనతో అతి తక్కువ సమయంలోనే లీగ్‌ను విజయవంతం చేసిన ఏసీఏ కృషి అభినందనీయమన్నారు. లీగ్‌లో ఉత్తమంగా రాణించిన క్రీడాకారులను చూసి మరింత మంది స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు.
వెలుగులోకి మట్టిలో మాణిక్యాలు
శాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి కార్యక్రమంలో మాట్లాడుతూ ఏసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రికెట్ లీగ్‌లతో ఎంతో మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయ పడ్డారు. ఏదైనా రంగంలో రాణించాలంటే కృషి, పట్టుదల, కష్టపడే విధానం ఉండాలన్నారు. నైపుణ్యమున్న క్రీడాకారులను ఎవరూ అడ్డుకోలేరని, క్రికెట్‌లో రాణిస్తే మీకు మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా తయారవుతారన్నారు. ఇటువంటి టోర్నీలలో రాణించి సత్తా చాటుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనతో దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేక లీగ్ నిర్వహించిన ఏసీఏకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఉత్తమ క్రీడాకారిణులకు ప్రత్యేక బహుమతులు
కార్యక్రమానికి ముందుగా ఉమన్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా విజయనగరం రాయల్స్ జట్టు సభ్యురాలు ఇ. పద్మజ, మోస్ట్ ప్రామిసింగ్ యంగ్‌స్టర్‌గా ఆయేష్‌ఖాన్, ఉత్తమ బ్యాటర్‌గా సీహెచ్ ఝాన్సీలక్ష్మి (259 పరుగులు), ఉత్తమ బౌలర్‌గా దేవిక (12 వికెట్లు)ల కు నిర్వాహకలు షీల్డులు, చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, రేవతీదేవి, ఏసీఏ ట్రెజరర్ గోపినాథ్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సత్యప్రసాద్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి ఫైనాన్షియల్ మేనేజర్ వైవీఎస్ జగన్నాథరావు, విజయనగరం జిల్లా క్రికెట్ అసొసియేషన్ కార్యదర్శి ఎంఎల్‌ఎన్ రాజు, ఎన్‌సీఏ కన్వీనర్ దేవవ ర్మ, ఎపెక్స్ కౌన్సిల్ సభ్యులు గౌతమ్, ఎం.డి రహ మాన్, అనూరాధ నిర్మల, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యు లు ఆర్‌వీసీహెచ్ ప్రసాద్, జీవీవీ గోపాలరాజు, హనీగ్రూప్ చైర్మన్ ఓబుల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఫైనల్ మ్యాచ్ జరిగిందిలా..
ముందుగా టాస్ గెలిచిన విజయనగరం రాయల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా వైజాగ్ డాల్ఫిన్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఆ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్లు అనూష (20 బంతుల్లో 17 పరుగులు), హెప్సిబ (19 బంతుల్లో 13 పరుగులు) తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించి శుభారంభం అందించినా మిగతా బ్యాటర్లు విఫలమవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 113 పరగులు సాధించారు. అనంతరం 114 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విజయనగరం రాయల్స్ జట్టు 18.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టు ఓపెనింగ్ బ్యాటర్, కెప్టెన్ స్నేహదీప్తి అద్భుతంగా ఆడి 30 బంతుల్లో ఒక సిక్స్, ఆరు ఫోర్ల సహాయంతో 45 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆ జట్టు బ్యాటర్లు హారిక యాదవ్ (11 పరుగులు), ఐశ్వర్యరాయ్ (14 పరుగులు), పద్మజ (28 పరుగులు నాటౌట్), అయేషాసింగ్ (11 పరుగులు నాటౌట్) రాణించి జట్టుకు విజయంతో పాటు ట్రోఫీని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment