Won title
-
ఫైనల్స్‌లో విజయనగరం రాయల్స్‌దే విజయం
విజయనగరం/విజయనగరం రూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించి చరిత్రలో నిలిచిపోవాలని రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా ఆకాంక్షించారు. జిల్లా కేంద్రం శివారు డెంకాడ మండలం చింతలవలసలోని డాక్టర్ పీవీజీ రాజు నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో ఆంధ్రా క్రికెట్ అసొసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి మహిళా టీ–20 లీగ్ నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన ఫైనల్ పోటీలకు మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లీగ్ విజేతగా నిలిచిన విజయనగరం రాయల్స్ జట్టుకు రూ.5 లక్షల చెక్కు, ట్రోఫీ అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన వైజాగ్ డాల్ఫిన్స్ జట్టుకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేతుల మీదుగా రూ. 3 లక్షల చెక్కు, ట్రోఫీని అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రోజా మాట్లాడుతూ మహిళలు ఇతర రంగాలతో పాటు క్రీడల్లోనూ పాల్గొనడం అభినందనీయమని ప్రశంసించారు. ఆటలకు ఆడపిల్లలు వద్దనకుండా వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మహిళా క్రికెటర్లకు ఇంత మంచి వేదిక కల్పించిన ఆంధ్రా క్రికెట్ అసొసియేషన్ (ఏసీఏ) పేరు ఆదర్శ క్రికెట్ అసోసియేషన్‌గా మారాలని ఆకాంక్షించారు. మహిళా పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పురుషులతో పాటు మహిళలకు ప్రత్యేకంగా లీగ్ నిర్వహించాలన్న సూచనతో అతి తక్కువ సమయంలోనే లీగ్‌ను విజయవంతం చేసిన ఏసీఏ కృషి అభినందనీయమన్నారు. లీగ్‌లో ఉత్తమంగా రాణించిన క్రీడాకారులను చూసి మరింత మంది స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. వెలుగులోకి మట్టిలో మాణిక్యాలు శాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి కార్యక్రమంలో మాట్లాడుతూ ఏసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రికెట్ లీగ్‌లతో ఎంతో మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయ పడ్డారు. ఏదైనా రంగంలో రాణించాలంటే కృషి, పట్టుదల, కష్టపడే విధానం ఉండాలన్నారు. నైపుణ్యమున్న క్రీడాకారులను ఎవరూ అడ్డుకోలేరని, క్రికెట్లో రాణిస్తే మీకు మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా తయారవుతారన్నారు. ఇటువంటి టోర్నీలలో రాణించి సత్తా చాటుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనతో దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేక లీగ్ నిర్వహించిన ఏసీఏకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉత్తమ క్రీడాకారిణులకు ప్రత్యేక బహుమతులు కార్యక్రమానికి ముందుగా ఉమన్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా విజయనగరం రాయల్స్ జట్టు సభ్యురాలు ఇ. పద్మజ, మోస్ట్ ప్రామిసింగ్ యంగ్‌స్టర్‌గా ఆయేష్‌ఖాన్, ఉత్తమ బ్యాటర్‌గా సీహెచ్ ఝాన్సీలక్ష్మి (259 పరుగులు), ఉత్తమ బౌలర్‌గా దేవిక (12 వికెట్లు)ల కు నిర్వాహకలు షీల్డులు, చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, రేవతీదేవి, ఏసీఏ ట్రెజరర్ గోపినాథ్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సత్యప్రసాద్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి ఫైనాన్షియల్ మేనేజర్ వైవీఎస్ జగన్నాథరావు, విజయనగరం జిల్లా క్రికెట్ అసొసియేషన్ కార్యదర్శి ఎంఎల్ఎన్ రాజు, ఎన్సీఏ కన్వీనర్ దేవవ ర్మ, ఎపెక్స్ కౌన్సిల్ సభ్యులు గౌతమ్, ఎం.డి రహ మాన్, అనూరాధ నిర్మల, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యు లు ఆర్వీసీహెచ్ ప్రసాద్, జీవీవీ గోపాలరాజు, హనీగ్రూప్ చైర్మన్ ఓబుల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్ జరిగిందిలా.. ముందుగా టాస్ గెలిచిన విజయనగరం రాయల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా వైజాగ్ డాల్ఫిన్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఆ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్లు అనూష (20 బంతుల్లో 17 పరుగులు), హెప్సిబ (19 బంతుల్లో 13 పరుగులు) తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించి శుభారంభం అందించినా మిగతా బ్యాటర్లు విఫలమవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 113 పరగులు సాధించారు. అనంతరం 114 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విజయనగరం రాయల్స్ జట్టు 18.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టు ఓపెనింగ్ బ్యాటర్, కెప్టెన్ స్నేహదీప్తి అద్భుతంగా ఆడి 30 బంతుల్లో ఒక సిక్స్, ఆరు ఫోర్ల సహాయంతో 45 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆ జట్టు బ్యాటర్లు హారిక యాదవ్ (11 పరుగులు), ఐశ్వర్యరాయ్ (14 పరుగులు), పద్మజ (28 పరుగులు నాటౌట్), అయేషాసింగ్ (11 పరుగులు నాటౌట్) రాణించి జట్టుకు విజయంతో పాటు ట్రోఫీని అందించారు. -
హామిల్టన్ సిక్సర్
టస్కన్ (ఇటలీ): గత రేసులో ఎదురైన పరాజయాన్ని పక్కనపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మళ్లీ విజయం రుచి చూశాడు. ఆదివారం జరిగిన టస్కన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో తొమ్మిది రేసులు జరగ్గా అందులో హామిల్టన్‌కిది ఆరో విజయం కావడం విశేషం. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 59 ల్యాప్‌లను 2 గంటల 19 నిమిషాల 35.060 సెకన్లలో ముగించి తన కెరీర్లో 90వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఈ క్రీడ చరిత్రలో 1000వ రేసులో బరిలోకి దిగిన ఫెరారీ జట్టుకు ఆశించిన ఫలితం రాలేదు. ఆ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెక్లెర్క్ 8వ స్థానంలో నిలిచి 4 పాయింట్లు... సెబాస్టియన్ వెటెల్ 10వ స్థానంలో నిలిచి ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకున్నారు. రేసులో మొత్తం 20 మంది డ్రైవర్లు పాల్గొనగా... 8 మంది రేసును పూర్తి చేయకుండానే వైదొలిగారు. తొలి ల్యాప్‌లోనే మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), పియర్ గ్యాస్లీ (అల్ఫా టౌరి) కార్లు ఢీ కొట్టుకొని తప్పుకోగా... ఐదో ల్యాప్‌లో మాగ్నుసెన్ (హాస్), గియోవినాజి (అల్ఫా రోమియో), కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్) కార్లు ఢీ కొట్టుకోవడంతో రేసు నుంచి నిష్క్రమించారు. ఆరో ల్యాప్‌లో నికొలస్ లతీఫి (విలియమ్స్), ఏడో ల్యాప్‌లో ఒకాన్ (రెనౌ), 42వ ల్యాప్‌లో లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్) వెనుదిరిగారు. రేసులో మూడుసార్లు అంతరాయం కలగడంతో గంటన్నరలోపే ముగియాల్సిన రేసు రెండు గంటలకుపైగా సాగింది. తొమ్మిది రేసుల తర్వాత హామిల్టన్ 190 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి ఈనెల 27న సోచి నగరంలో జరుగుతుంది. -
హామిల్టన్‌కే టైటిల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఈ సీజన్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో ఐదో విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 44 ల్యాప్‌లను గంటా 24 నిమిషాల 08.761 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 89వ టైటిల్ కావడం విశేషం. మరో రెండు టైటిల్స్ గెలిస్తే అత్యధిక ఎఫ్1 టైటిల్స్ గెలిచిన జర్మనీ దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానాన్ని పొందాడు. ఒకే రేసులో ఇద్దరు మెర్సిడెస్ డ్రైవర్లు టాప్–2లో ఉండటం ఇది 50వసారి కావడం విశేషం. ఏడు రేసులు ముగిసిన ఈ సీజన్లో ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ 157 పాయింట్లతో ‘టాప్’లో ఉన్నాడు. బెల్జియం గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. రికియార్డో (రెనౌ), 5. ఒకాన్ (రెనౌ), 6. అల్బోన్ (రెడ్‌బుల్), 7. నోరిస్ (మెక్లారెన్), 8. గాస్లీ (అల్ఫా టౌరి), 9. లాన్స్ స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 10. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్). -
విజేత హలెప్
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ఆరు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ప్రాగ్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ హలెప్ 6–2, 7–5తో మూడో సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది. ఈ ఏడాది హలెప్ ఖాతాలో చేరిన రెండో టైటిల్ ఇది. ఓవరాల్‌గా ఆమె కెరీర్లో ఇది 21వ సింగిల్స్ టైటిల్. 93 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో హలెప్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. చాంపియన్ హలెప్‌నకు 25 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 71 వేలు)తోపాటు 280 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫెడరర్ ఏడోసారి...
- సిన్సినాటి మాస్టర్స్ టైటిల్ సొంతం సిన్సినాటి (అమెరికా): గతంలో తనకెంతో కలిసొచ్చిన సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఏడోసారి సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ఫెడరర్ 7-6 (7/1), 6-3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు. తద్వారా గత నెలలో వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నాడు. సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించిన ఫెడరర్... ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్, రెండో ర్యాంక్ ఆటగాళ్లను ఓడిస్తూ టైటిల్‌ను సాధించాడు. తాజా విజయంతో సోమవారం విడుదలైన ఏటీపీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఫెడరర్ మళ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఫైనల్లో నెగ్గిన ఫెడరర్‌కు 7,31,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 4 కోట్ల 89 లక్షలు) లభించింది. గతంలో ఫెడరర్ సిన్సినాటి మాస్టర్స్ టైటిల్‌ను 2005, 2007, 2009, 2010, 2012, 2014లలో సాధించాడు. ఒకవేళ జొకోవిచ్ ఈ టైటిల్‌ను నెగ్గి ఉంటే ఏటీపీ మాస్టర్స్ సిరీస్‌లోని తొమ్మిది టోర్నీలనూ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేవాడు.