స్పా–ఫ్రాంకోర్‌చాంప్స్ (బెల్జియం): ఈ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో ఐదో విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 44 ల్యాప్‌లను గంటా 24 నిమిషాల 08.761 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ కెరీర్‌లో ఇది 89వ టైటిల్ కావడం విశేషం. మరో రెండు టైటిల్స్ గెలిస్తే అత్యధిక ఎఫ్1 టైటిల్స్ గెలిచిన జర్మనీ దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానాన్ని పొందాడు. ఒకే రేసులో ఇద్దరు మెర్సిడెస్ డ్రైవర్లు టాప్–2లో ఉండటం ఇది 50వసారి కావడం విశేషం. ఏడు రేసులు ముగిసిన ఈ సీజన్‌లో ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ 157 పాయింట్లతో ‘టాప్’లో ఉన్నాడు.
బెల్జియం గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), 4. రికియార్డో (రెనౌ), 5. ఒకాన్ (రెనౌ), 6. అల్బోన్ (రెడ్‌బుల్), 7. నోరిస్ (మెక్‌లారెన్), 8. గాస్లీ (అల్ఫా టౌరి), 9. లాన్స్ స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 10. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్).
Comments
Please login to add a commentAdd a comment