విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఏడో మ్యాచ్‌లో స్పిన్నర్ల గింగిరాల బంతులకు బ్యాటర్లు చేతులెత్తేశారు. పేసర్లను చెండాడిన ఇరు జట్ల బ్యాటర్లు.. స్పిన్నర్లకే దొరికిపోయారు. వికెట్ కోల్పోకుండానే వైజాగ్ వారియర్స్ ఓపెనర్ల జోడి 29 బంతుల్లోనూ... గోదావరి టైటాన్స్ ఓపెనర్ల జోడి 30 బంతుల్లో అర్ధ సెంచరీలు నమోదు చేశాయి. టైటాన్ జట్టుకు చెందిన ఇస్మాయిల్ ఈ మ్యాచ్‌లో అత్యధికంగా లెగ్ బ్రేక్‌తో నాలుగు వికెట్లు తీయగా... వారియర్స్ జట్టుకు చెందిన ఆంజనేయులు మూడు, మల్లికార్జున రెండు వికెట్లను మణికట్టు మయాజాలంతో పడగొట్టారు.
వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన డే మ్యాచ్‌లో టాస్ గెలిచి గోదావరి టైటాన్స్ కెప్టెన్ శశికాంత్ వైజాగ్ వారియర్స్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. వారియర్ ఓపెనర్లు అశ్విన్(43), గిరినాథ్ (44) 9.3 ఓవర్ల వరకు ఆడి 98 పరుగులు చేశారు. పేసర్లను చెండాడిన ఈ జోడి... ఇస్మాయిల్ లెగ్ బ్రేక్‌కి దొరికిపోయింది. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన అశ్విన్ క్లీన్ బౌల్డ్ కాగా.. ఐదు ఫోర్లు, సిక్సర్ బాదిన గిరినాథ్ కూడా ఇస్మాయిల్ బౌలింగ్‌లోనే వికెట్ల వెనుక వంశీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
టాప్‌ఆర్డర్‌లో వచ్చిన వేణు(10)ను క్లీన్ బౌల్డ్‌గా.. కరణ్ షిండే(8)ను లెగ్‌బిఫోర్‌గా ఇస్మాయిలే పెవిలియన్‌కు పంపాడు. శశికాంత్ బౌలింగ్‌లో నరేన్(25) డీప్ మిడ్ వికెట్‌లో సాత్విక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో వైజాగ్ వారియర్స్ ఐదు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది.
53 పరుగులకే ఎనిమిది వికెట్లు
ధాటిగానే ఆటను ప్రారంభించిన టైటాన్స్ తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించింది. ఓపెనర్ హేమంత్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 57 పరుగులు చేయగా మరో ఓపెనర్ వంశీకృష్ణ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. పేస్‌ను దీటుగా ఎదుర్కొంటున్న సమయంలో అశ్విన్ స్పిన్నర్లకు బంతిని అందించాడు. అంతే ఒక్కసారిగా ఆట తీరు మారిపోయింది. కేవలం 53 పరుగులకు టైటాన్స్ ఆటను ముగించాల్సి వచ్చింది. ఆంజనేయులు లెఫ్టార్మ్ స్పిన్‌తో ఆరు పరుగులే ఇచ్చి ముగ్గురిని పెవిలియన్‌కు పంపగా.. వేసిన నాలుగు ఓవర్లలో రెండు మేడిన్లు కావడం విశేషం. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ మల్లికార్జున రెండు వికెట్లు తీశాడు.
7.3 ఓవర్లకు 88 పరుగుల వద్ద తొలి వికెట్ పడగా 20 ఓవర్లలో 141 పరుగులకే టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 44 పరుగుల తేడాతో వారియర్స్ విజయం సాధించింది. ఇస్మాయిల్ ఎనిమిది పరుగుల(ఒక ఫోర్)తో చివరి వికెట్‌కు నిలవడంతో ఆలౌట్ కాకుండా టైటాన్స్ కాపాడుకోగలిగారు. సందీప్(15) రెండంకెల స్కోర్ చేయగలిగాడు. వేణు, మనోహార్ చెరో వికెట్ తీసి జట్టు విజయానికి సహకరించారు. బెస్ట్ బౌలర్, మ్యాచ్ బెస్ట్‌గా ఆంజనేయులు, బెస్ట్ బ్యాటర్‌గా హేమంత్ నిలిచారు.
ఆధిక్యంలో బెజవాడ టైగర్స్
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్‌లో నాలుగో రోజు మ్యాచ్‌లు ముగిసేప్పటికి రెండే మ్యాచ్‌లాడినా బెజవాడ టైగర్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడేసి మ్యాచ్‌లాడిన ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్ జట్లతో టైగర్స్ ఆరేసి పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్‌రేట్‌తో ఆధిక్యంలో నిలిచింది. శనివారం మ్యాచ్‌లో విజయంతో కోస్టల్ రైడర్స్ నాలుగు పాయింట్లు(మూడు మ్యాచ్‌ల్లో) సాధించడంతో ఐదో స్థానానికి చేరుకోగా.. రెండు మ్యాచ్‌లాడిన వైజాగ్ వారియర్స్ నాలుగు పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతోంది.
తడబడిన లయన్స్
ఫ్లడ్‌లైట్ల వెలుతురులో కోస్టల్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఉత్తరాంధ్ర లయన్స్ కెప్టెన్ భరత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన కెప్టెన్లు ఫీల్డింగ్‌నే ఎంచుకోగా.. అందుకు భిన్నంగా భరత్ తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపాడు. దానికి తగ్గట్టుగానే ఓపెనింగ్ జోడి తొలి వికెట్‌ను 10.3 ఓవర్ల వరకు చేజార్చుకోకుండానే 89 పరుగులు చేసింది. అర్ధసెంచరీ చేసిన భరత్ (52, నాలుగేసి ఫోర్లు, సిక్సర్లతో) శ్రీనివాస్ వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
రెండు పరుగులు జత చేసి మరో ఓపెనర్ క్రాంతి(32) శ్రీనివాస్ వేసిన బంతిని ఆడబోయి కెప్టెన్ జ్ఞానేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో 42 పరుగులు చేసిన లయన్స్ ఎనిమిది వికెట్లకు 133 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. ముగ్గురు రనౌట్‌గానే వెనుదిరిగారు. ఆఫ్‌బ్రేక్‌తో శ్రీనివాస్ మూడు వికెట్లు తీయగా స్టీఫెన్, తపస్వి చెరో వికెట్ తీశారు.
రైడర్స్ దూకుడు
దూకుడుగానే ఆటను ప్రారంభించిన కోస్టల్ రైడర్స్ ఓపెనర్లు మొదటి మూడు ఓవర్లలో 37 పరుగులు రాబట్టారు. ఈ స్థితిలో షోయబ్ వేసిన తొలి బంతికి ప్రణీత్(24, నాలుగు ఫోర్లు, సిక్సర్) లెగ్‌బిఫోర్‌గా ఔటయ్యాడు. నాలుగో బంతికి కెప్టెన్ జ్ఞానేశ్వర్(11, రెండు ఫోర్లతో)ను బౌల్డ్ చేశాడు. టాప్ ఆర్డర్‌లో మునీష్, హర్ష నిలకడగా ఆడి స్కోర్‌ను 50(5.5 ఓవర్లలో) పరుగులకు చేర్చారు. టాప్ మిడిలార్డర్‌లో కీపర్ బ్యాటర్ లేఖజ్ 32 పరుగులతో(27 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో), తపస్వి 43 పరుగులతో (21 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) నిలిచి జట్టుకు విజయాన్నందించారు.
వీరి జోడి 12.1 ఓవర్లలోనే స్కోర్‌ను వంద పరుగుల మార్కుకు చేర్చింది. రైడర్స్ 15 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ఆఫ్‌బ్రేక్‌తో షోయబ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. వర్మ ఒక వికెట్ తీశాడు. తపస్వి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. బెస్ట్ బ్యాటర్‌గా భరత్, బెస్ట్ బౌలర్‌గా షోయబ్‌ఖాన్ నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment