రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా రోహ్‌తక్ వేదికగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కాంబోజ్ 10 వికెట్లతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 30.1 ఓవర్లు బౌలింగ్ చేసిన కాంబోజ్.. 49 పరుగులిచ్చి మొత్తం 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
తొలి రోజు ఆటలో రెండు వికెట్లు పడగొట్టిన అన్షుల్.. రెండో రోజులో మిగితా 8 వికెట్లను నేలకూల్చాడు. తద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అన్షుల్ రికార్డులకెక్కాడు.
ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో కాంబోజ్ కంటే ముందు బెంగాల్ దిగ్గజం ప్రేమాంగ్షు ఛటర్జీ, రాజస్థాన్ మాజీ ప్లేయర్ ప్రదీప్ సుందరం ఉన్నారు. 1956-57 సీజన్‌లో అస్సాంపై ప్రేమాంగ్షు ఛటర్జీ ఈ ఫీట్ సాధించగా.. 1985-86 సీజన్‌లో విదర్భపై ప్రదీప్ సుందరం 10 వికెట్లు పడగొట్టాడు.
మళ్లీ ఇప్పుడు 39 సంవత్సరాల తర్వాత అన్షుల్ కాంబోజ్ ఈ ఎలైట్ జాబితాలో చేరాడు. కాంబోజ్ బౌలింగ్ మ్యాజిక్ ఫలితంగా కేరళ తమ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటివరకు 19 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన కాంబోజ్.. 57 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా కాంబోజ్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు.
ఎవరీ అన్షుల్ కాంబోజ్..?
23 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ హర్యానా తరపున 2022 రంజీ సీజన్‌లో త్రిపురాపై ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. కాంబోజ్‌కు అద్బుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు 19 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన కాంబోజ్.. 57 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
కాంబోజ్ ఐపీఎల్‌లో కూడా ఆడాడు. దేశీవాళీ టోర్నీల్లో సంచలన ప్రదర్శన కనబరుస్తుండడంతో ఐపీఎల్-2024 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు. ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా జరగనున్న మెగా వేలంలో ఈ హర్యానా పేసర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది.
చదవండి: IND Vs AUS: 'కింగ్ తన రాజ్యానికి తిరిగొచ్చాడు'.. ఆసీస్‌ను హెచ్చరించిన రవిశాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment