జ్యూరిక్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా జట్టు ఆరేళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ఇటీవల పనామా, కురాసావ్ జట్లతో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా గెలుపొందడంతో మెస్సీ బృందం రెండో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకుంది. గత ఏడాది ఖతర్‌లో జరిగిన ప్రపంచకప్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా 36 ఏళ్ల తర్వాత జగజ్జేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
మొరాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో బ్రెజిల్ ఓడిపోవడంతో ఆ జట్టు నంబర్‌వన్ ర్యాంక్ నుంచి రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్‌కు చేరుకుంది. మూడో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ రెండో స్థానానికి ఎగబాకింది. బెల్జియం నాలుగో ర్యాంక్‌లో, ఇంగ్లండ్ ఐదో ర్యాంక్‌లో ఉన్నాయి.
భారత్ @ 101
గురువారం విడుదల చేసిన ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఐదు స్థానాలు పురోగతి సాధించి 101వ ర్యాంక్‌కు చేరుకుంది. స్వదేశంలో జరిగిన మూడు దేశాల టోర్నీలో కిర్గిజ్ రిపబ్లిక్, మయాన్మార్ జట్లపై గెలిచి విజేతగా నిలవడంతో ర్యాంకింగ్స్‌లో భారత్ ఎగబాకింది. 1994లో భారత్ అత్యుత్తమంగా 94వ ర్యాంక్‌లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment