లండన్: ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ డబ్ల్యూఆర్ చెస్ మాస్టర్స్ కప్ టోర్నీలో చాంపియన్‌గా అవతరించాడు. 16 మంది క్రీడాకారుల మధ్య నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరిగింది. ఫైనల్లో అర్జున్ ‘అర్మగెడాన్’ గేమ్‌లో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమి లాషెర్ లగ్రేవ్‌పై విజయం సాధించాడు. అంతకుముందు వీరిద్దరి మధ్య జరిగిన రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.
తొలి గేమ్ 30 ఎత్తుల్లో... రెండో గేమ్ 38 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్’ గేమ్‌ను నిర్వహించారు. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం అర్మగెడాన్ గేమ్‌లో తెల్లపావులతో ఆడే ప్లేయర్‌కు పది నిమిషాలు, నల్లపావులతో ఆడే ప్లేయర్‌కు ఆరు నిమిషాలు కేటాయిస్తారు. తెల్లపావులతో ఆడే ప్లేయర్ కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. నల్లపావులతో ఆడే ప్లేయర్ కనీసం ‘డ్రా’ చేసుకున్నా విజేతగా ప్రకటిస్తారు.
అర్మగెడాన్ గేమ్‌లో లగ్రేవ్ తెల్లపావులతో, అర్జున్ నల్లపావులతో ఆడారు. అయితే అర్జున్ ఈ గేమ్‌ను ‘డ్రా’ చేసుకోకుండా 69 ఎత్తుల్లో లగ్రేవ్‌ను ఓడించడం విశేషం. సెమీఫైనల్లో అర్జున్ 1.5–0.5తో భారత్‌కే చెందిన ప్రజ్ఞానందపై, క్వార్టర్ ఫైనల్లో 1.5–0.5తో విదిత్ సంతోష్ గుజరాతిపై, గెలిచాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు 20 వేల యూరోలు (రూ. 18 లక్షల 25 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీలో ప్రదర్శన ద్వారా అర్జున్ ఎలో రేటింగ్ 2796 పాయింట్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment