మాల్మో (స్వీడన్): టెపె సెజెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో పీటర్ స్విద్లెర్ (రష్యా), అర్జున్, నొదిర్‌బెక్ అబ్దుసత్తొరోవ్ (ఉజ్బెకిస్తాన్) 4.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు.
విజేతను నిర్ణయించడానికి ఈ ముగ్గురి మధ్య బ్లిట్జ్ గేమ్ టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్‌లో అర్జున్, నొదిర్‌బెక్ చేతిలో స్విద్లెర్ ఓడిపోయాడు. దాంతో అర్జున్, నొదిర్‌బెక్ టైటిల్ కోసం తలపడ్డారు.
అర్జున్, నొదిర్‌బెక్ మధ్య రెండు గేమ్‌లు నిర్వహించగా... తొలి గేమ్‌ను అర్జున్ ‘డ్రా’ చేసుకొని, రెండో గేమ్‌లో ఓడిపోవడంతో నొదిర్‌బెక్ చాంపియన్‌గా అవతరించాడు.
ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ .. ఆరో ర్యాంకులో గుకేశ్
చెన్నై: గత నెలలో క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు టీనేజర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు.
గత నెలలో 16వ స్థానంలో ఉన్న గుకేశ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. క్యాండిడేట్స్ టోర్నీ ప్రదర్శనతో గుకేశ్ 21 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం గుకేశ్ ఖాతాలో 2764 రేటింగ్ పాయింట్లున్నాయి.
తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 2761 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 2751 రేటింగ్ పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు.
భారత ఇతర గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద 14వ ర్యాంక్‌లో, విదిత్ 28వ ర్యాంక్‌లో, పెంటేల హరికృష్ణ 37వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల చెస్ ర్యాంకింగ్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి 5వ ర్యాంక్‌లో, ద్రోణవల్లి హారిక 11వ ర్యాంక్‌లో, వైశాలి 13వ ర్యాంక్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment