ఆశిష్ నెహ్రా(ఫైల్‌ఫోటో)
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా సాధించలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రక్షాళన అవసరమని తాజాగా వినిపిస్తున్న మాట. అయితే ఆర్సీబీ ఎక్కువగా ఆటగాళ్లను మారుస్తూ ఉంటుందనేది కూడా కాదనలేని వాస్తవం. అయితే ఇలా చేయవద్దని అంటున్నాడు ఆర్సీబీ మాజీ బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా. ఎక్కువ మంది ఆటగాళ్లను వదిలేసుకోవడం, మళ్లీ వేలానికి వెళ్లడం వంటి ప్రక్రియ జట్టుకు మంచిది కాదన్నాడు. ఇలా చేయడం వల్లే ఆర్సీబీ ఎక్కువగా విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లపై ఆధారపడాల్సి వస్తుందన్నాడు. ఈ ఇద్దరి చుట్టూనే జట్టు తిరుగుతూ ఉంటుందని నెహ్రా పేర్కొన్నాడు. క్రికెట్ అనేది 11 మంది ఆటగాళ్లు ఆడే ఆట అని తెలిపాడు. (ఒక గిఫ్ట్‌గా ముంబై చేతిలో పెట్టారు: టామ్ మూడీ)
తీసుకున్న ఆటగాళ్లను కనీసం రెండు మూడేళ్ల పాటు నిలబెట్టుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చన్నాడు. జట్టులో నిలకడ రావాలంటే కోహ్లి, డివిలియర్స్, చాహల్‌లు కొనసాగుతున్నట్లు ఇతర ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలన్నాడు. ఎప్పుడూ ఆర్సీబీని చూసినా ముగ్గురు నుంచి నలుగురు మాత్రమే రిటైన్ అయిన ఆటగాళ్లు తుది జట్టులో ఆడుతూ ఉంటారన్నాడు. ఆర్సీబీలో ఎక్కువగా ఆటగాళ్లను తీసుకోవడం, వదిలేయడం మాత్రమే జరుగుతూ ఉంటుందని, ఇది మంచి పరిణామం కాదన్నాడు. ఒక మంచి జట్టుగా రూపాంతరం చెందాలంటే ఒక తుది జట్టు అంటూ ఉండాలన్నాడు. వేలంలో ప్రతీసారి ఆటగాళ్లను మార్చలేరని విషయం తెలుసుకోవాలన్నాడు. ప్రతీసారి జట్టులోకి కొత్త ఆటగాళ్లను తీసుకుంటూ పోతే చివరకు తీసుకున్న వాళ్లనే మళ్లీ తీసుకోవాల్సి వస్తుందన్నాడు. ఉన్న జట్టునే కనీసం మూడేళ్ల పాటు కొనసాగిస్తే వారి సత్తా బయటకు వస్తుందన్నాడు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో ఈసారైనా కప్‌ను సాధించాలనే ఆర్సీబీ ఆశలకు ప్లేఆఫ్స్‌తోనే బ్రేక్‌పడింది.
Comments
Please login to add a commentAdd a comment