వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించినప్పుడు సెలక్టర్లను అందరూ పదే పదే అడిగిన ప్రశ్న...‘జట్టులో ఒక్క ఆఫ్ స్పిన్నర్ కూడా లేడు, ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు జడేజా, అక్షర్‌లకు చోటు ఎంత వరకు సమంజసం, స్పిన్ బౌలింగ్‌లో వైవిధ్యం లేకపోతే ఎలా’ అని! తమ ఎంపికను సమర్థించుకుంటూ చీఫ్ సెలక్టర్ అగార్కర్ దానికి వివరణ ఇచ్చుకుంటూ పోయాడు. అయితే ఇప్పుడు అక్షర్ పటేల్ గాయం వారిలోనూ కొత్త ఆలోచనను తెచ్చినట్లుంది. అందుకే ముందుగా ఆసియా కప్ ఫైనల్ కోసం ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు ఇప్పుడు సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌నూ జట్టులోకి తెచ్చారు.
టీమ్ ప్రకటనకు తుది గడువైన సెప్టెంబర్ 28లోగా అక్షర్ కోలుకోకపోతే మరి అనుభవాన్ని బట్టి అశ్విన్‌ను తీసుకుంటారా, లేక సుందర్ వైపు మొగ్గు చూపుతారా అనేది చూడాలి. అయితే ఏడాదిన్నర క్రితం తన చివరి వన్డే ఆడిన అశ్విన్ ఇప్పు డు ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడనేదే ఆసక్తికరం.
అశ్విన్ స్థాయి ఆటగాడికి బరిలోకి దిగి ఎన్ని రోజులైందనేది పెద్ద విషయం కాదు. అతని అనుభవం అన్నింటికంటే కీలకం. అందుకే తీసుకున్నాం. వన్డేలు ఆడకపోయినా అతను టెస్టు రెగ్యులర్, స్థానిక తమిళనాడు లీగ్‌కు కూడా ఆడుతున్నాడు. ఆ్రస్టేలియాతో ఆడితే అతని ప్రస్తుతం ఆట ఏమిటో మాకు అర్థమవుతుంది. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్
ముంబై: ప్రపంచ కప్‌కు ముందు సన్నాహకంగా స్వదేశంలో ఆ్రస్టేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. అయితే తొలి రెండు వన్డేలకు ఒక జట్టు, చివరి వన్డేకు మరో జట్టును విడివిడిగా ఎంపిక చేశారు. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పునరాగమనమే ఈ ఎంపికలో విశేషం. ఆసియా కప్ కోసం ముందుగా ఎంపిక చేసిన ప్రధాన జట్టులో ఆఫ్‌స్పిన్నర్ లేడు. ఫైనల్‌కు ముందు సుందర్ జట్టుతో చేరగా, ఇప్పుడు తాజా సిరీస్ కోసం అతనితో పాటు అశ్విన్‌కూ అవకాశమిచ్చారు. సుందర్‌ను ఈ సిరీస్ కోసం కూడా కొనసాగించనున్నారు.
ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా టీమ్‌లో చోటు లభించింది. తొలి రెండు వన్డేలు ఆడిన అతను ఆ తర్వాత ఆసియా క్రీడల జట్టుతో కలుస్తాడు. నలుగురు ప్రధాన ఆటగాళ్లకు తొలి రెండు మ్యాచ్‌నుంచి విశ్రాంతి కల్పించారు. ఆసియా కప్‌లో ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లకు విరామం లభించింది. గాయం కారణంగా అక్షర్ పటేల్ తొలి రెండు మ్యాచ్‌లకు ముందే దూరమయ్యాడు. రోహిత్ లేకపోవడంతో కేఎల్ రాహుల్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
అయితే మూడో వన్డేకు మాత్రం వీరంతా తిరిగొస్తారు. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మంది బృందాన్నే చివరి వన్డేకు ఎంపిక చేశారు. వీరికి తోడు అదనంగా అశ్విన్, సుందర్‌లకు కూడా చోటు లభించింది. అప్పటికి అక్షర్ పటేల్ కోలుకుంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. లేదంటే అక్షర్ స్థానంలో అశ్విన్, సుందర్‌లలో ఒకరికి చివరి వన్డేలో, ఆపై వరల్డ్ కప్ టీమ్‌లోనూ అవకాశం దక్కుతుంది.
ఆరేళ్లలో రెండు వన్డేలే..
2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో భాగమైన అశ్విన్ తన 12 ఏళ్ల వన్డే కెరీర్‌లో 113 మ్యాచ్‌లలో 33.49 సగటుతో 151 వికెట్లు పడగొట్టాడు. 2015 వన్డే వరల్డ్ కప్ కూడా ఆడాడు. అయితే 2017 చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓటమి తర్వాత అతనిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఆ వెంటనే వెస్టిండీస్ గడ్డపై 3 వన్డేలు ఆడిన తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత నాలుగున్నరేళ్ల పాటు అతనికి వన్డేల్లో అవకాశమే దక్కలేదు. ఈ మధ్య కాలంలో టెస్టుల్లో నంబర్‌వన్‌గా అద్భుత విజయాలు అందించడంతో పాటు ఐపీఎల్‌లో కూడా అతను చెప్పుకోదగ్గ ప్రదర్శనే నమోదు చేశాడు.
ఆ తర్వాత అనూహ్యంగా 2022 జనవరిలో దక్షిణాఫ్రికాతో 2 వన్డేలు ఆడి అవకాశం లభించింది. పార్ల్‌లో జరిగిన మ్యాచ్‌లో 10 ఓవర్లలో వికెట్ తీయకుండా 68 పరుగులు ఇవ్వడంతో అతని ఆట అక్కడ ముగిసింది. అంటే ఆరేళ్ల వ్యవధిలో అతను 2 మ్యాచ్‌లు ఆడినట్లే లెక్క! అంతర్జాతీయ టి20 కెరీర్ కూడా ముగిసినట్లే అనిపించిన దశలో అశ్విన్ అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న టీమిండియా సెలక్టర్లు ఊహించని రీతిలో గత ఏడాది వరల్డ్ కప్‌కు తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడా సరిగ్గా అదే పని చేయవచ్చు.
ఫార్మాట్‌లో పని లేకుండా తెలివైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగల నైపుణ్యం అశ్విన్ సొంతం. వరల్డ్ కప్ ప్రత్యర్థి జట్లలో ప్రధాన ఆటగాళ్లలో చాలా మంది ఎడంచేతి వాటం ఉన్నారు. వారికి అశ్విన్ ప్రమాదకారి కాగలడు. అన్నింటికి మించి వ్యూహాలపరంగా అతని అనుభవం అక్కరకు రావచ్చు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే కావచ్చు రోహిత్ అతని ఎంపికపై ఆసక్తి చూపించాడు. అశ్విన్‌తో తాను ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నానని, వరల్డ్ కప్ జట్టులో స్థానం అసాధ్యమేమీ కాదన్నట్లుగా రోహిత్ బహిరంగంగానే మద్దతు పలికాడు.
ఆ్రస్టేలియాతో సిరీస్‌కు భారత జట్టు (తొలి రెండు వన్డేలకు) :
రాహుల్ (కెప్టెన్), జడేజా (వైస్ కెప్టెన్), గిల్, రుతురాజ్, శ్రేయస్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, శార్దుల్, బుమ్రా, సిరాజ్, షమీ, తిలక్, ప్రసిధ్, అశ్విన్, సుందర్.
Comments
Please login to add a commentAdd a comment