నాపై రూ. కోటిన్నర ఖర్చు చేయలేదు
కేంద్ర క్రీడా శాఖ వ్యయ నివేదికపై షట్లర్ అశ్విని పొన్నప్ప అసంతృప్తి
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడాశాఖ ఒలింపిక్స్ లక్ష్యంగా ఒక్కో క్రీడాకారుడిపై చేసిన ఖర్చుపై నివేదికను విడుదల చేస్తుంది. అయితే మహిళా డబుల్స్ స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్పపై ఆ శాఖ విడుదల చేసిన వ్యయ నివేదికపై ఆమె మండిపడింది. అత్తెసరు, అరకొర సాయం తప్ప అవసరమైన వ్యక్తిగత కోచ్‌నే ఇవ్వలేదని... అలాంటపుడు ఏకంగా రూ. కోటిన్నర తనపై ఖర్చు చేసినట్లు ఎలా చెబుతారని కేంద్ర క్రీడా శాఖ నిర్వాకంపై అసంతృప్తి వెలిబుచ్చింది.
‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్’ (టాప్స్) కింద రూ. 4.5 లక్షలు, అలాగే వార్షిక శిక్షణ, టోర్నీల్లో పాల్గొనడం (ఏసీటీసీ) కోసం రూ. 1 కోటి 48.04 లక్షలను అశ్వినిపై ఖర్చు చేసినట్లుగా ‘సాయ్’ వ్యయ నివేదికలో పేర్కొంది. దీనిపై స్పందించిన షట్లర్ ‘ఇది చూసి నేనైతే తేరుకోలేనంత షాక్‌కు గురయ్యాను. నాకు ఆర్థిక సాయం అందలేదనే చింత లేదు కానీ అంత మొత్తం నాకు కేటాయించారనే తప్పుడు నివేదిక ఇవ్వడం ఏంటి. నిజంగా చెబుతున్నా.
‘సాయ్’... క్రీడా శాఖ నివేదికలో వివరించినట్లుగా నేనెలాంటి నిధులు అందుకోలేదు. జాతీయ శిక్షణ విషయానికొస్తే... రూ. కోటిన్నర నిధుల్ని మొత్తం శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులపై ఖర్చు పెట్టారు. అంతేతప్ప నా ఒక్కరికే అంత మొత్తం ఇవ్వనేలేదు. ఇంకా చెప్పాలంటే నాకు వ్యక్తిగత కోచే లేడు. క్రీడా శాఖ నియమించనూ లేదు. నా వ్యక్తిగత ట్రెయినర్‌ను సొంతడబ్బులతో నేనే ఏర్పాటు చేసుకున్నా. ఇలా చెబుతున్నది నిజం తెలియాలనే తప్పా నాకు డబ్బులు ఇవ్వాలని కానేకాదు.
2023 నవంబర్ వరకు కూడా నా సొంత ఖర్చులతోనే శిక్షణ తీసుకున్నా, పోటీల్లో పాల్గొన్నా... ఆ తర్వాతే టాప్స్‌కు ఎంపికయ్యా’ అని 34 ఏళ్ల అశ్విని వివరించింది. మేటి డబుల్స్ షట్లర్‌గా ఎదిగిన అశ్విని కామన్వెల్త్ క్రీడల్లో 2010లో స్వర్ణం, 2014లో రజతం, 2018లో కాంస్యం గెలిచింది. 2011 ప్రపంచ చాంపియన్‌షిలో గుత్తా జ్వాలతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. జ్వాలతోనే కలిసి 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్‌లలో డబుల్స్‌లో పోటీపడింది. పారిస్ ఒలింపిక్స్‌లో తనీషాతో కలిసి బరిలోకి దిగిన అశ్విని గ్రూప్ దశలోనే వెనుదిరిగింది.
Comments
Please login to add a commentAdd a comment