
Asia Badminton Team Championship 2022- షా ఆలమ్ (మలేసియా): ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు నాకౌట్ చేరే ఆశలు సజీవంగా నిలిచాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో హాంకాంగ్‌పై గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌కిదే తొలి గెలుపు. భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాలంటే ఇండోనేసియాతో నేడు జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు హాంకాంగ్ చేతిలో దక్షిణ కొరియా ఓడిపోవాలి.
కాగా హాంకాంగ్‌తో జరిగిన పోరులో నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో మిథున్ మంజునాథ్ 21–14, 17–21, 21–11తో జేసన్ గుణవాన్‌ను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–19, 21–10తో లీ చెయుక్ యుపై నెగ్గి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించాడు.
ఇక రెండో మ్యాచ్‌లో మంజిత్ సింగ్–డింకూ సింగ్ జంట ఓడిపోగా... మూడో మ్యాచ్‌లో కిరణ్ జార్జి కూడా ఓటమి పాలయ్యాడు. అయితే నాలుగో మ్యాచ్‌లో హరిహరన్–రూబన్ కుమార్ జోడీ 21–17, 21–16తో చౌ హిన్ లాంగ్–లుయ్ చున్ వాయ్ జంటపై నెగ్గి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక మ్యాచ్‌లో మిథున్ గెలుపొందడంతో భారత్ గట్టెక్కింది.
చదవండి: Ishan Kishan-Rohit Sharma: ఇషాన్ కిషన్‌కు క్లాస్ పీకిన రోహిత్ శర్మ.. విషయమేంటి