సెహ్వాగ్- గంగూలీ(PC: BCCI)
Asia Cup 2022 Ind Vs Pak: భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన క్రేజ్. ముఖ్యంగా ఆటగాళ్లపై ఇరు జట్ల అభిమానుల అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. వాటిని అందుకోలేకపోయారా ఇక అంతే సంగతులు! అంతేకాదు తమ జట్టు ఓటమికి కారణమైన ప్రత్యర్థిని ట్రోల్ చేయడం కూడా పరిపాటి!
ఒక్కోసారి అభిమానం హద్దులు దాటి.. దూషణలకు కారణమవుతుంది. దాయాదుల మధ్య పోరును ఇరు వర్గాల అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావించడమే ఇందుకు కారణం. అయితే, ఆటగాళ్లుగా తమ మధ్య మైదానంలో మాత్రమే పోటీ ఉంటుందని.. ఒక్కసారి మ్యాచ్ ముగిశాక అంతా కలిసి అన్నదమ్ముల్లా మెలుగుతామని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నాడు. తమ మధ్య వైరం ఆట వరకే పరిమితమని స్పష్టం చేశాడు.
ఆసక్తికర పోరు..
ఆసియా కప్-2022 టోర్నీ శనివారం(ఆగష్టు 27) నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు భారత్- పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఇక టీ20 ప్రపంచకప్-2021 తర్వాత చిరకాల ప్రత్యర్థులు ముఖాముఖి పోటీపడటం ఇదే తొలిసారి కావడంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మేము స్నేహితులం.. అన్నా.. తమ్ముడు అనుకుంటాం!
ఈ నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సెహ్వాగ్.. ఆటను ఆటలాగే చూడాలని సూచించాడు. ‘‘ఇండియా- పాకిస్తాన్ జట్లు మైదానంలోకి దిగాయంటే.. పోటీ తారస్థాయిలోనే ఉంటుంది. ఏ ఆటగాడైనా సరే తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని భావిస్తాడు. ఈ విషయంలో టీమిండియా క్రికెటర్ అయినా.. పాక్ ఆటగాడైనా ఒకటే.
తమ జట్టును గెలిపించాలనే ఆడతారు. అయితే, ఒక్కసారి మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్‌కు వెళ్లగానే మేమంతా కలిసి సమయం గడుపుతాం. మా మధ్య అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం.. ఇండియా, పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య గొడవలు జరుగుతాయంటూ ఏవేవో మాట్లాడతారు.
నిజానికి అలాంటివేం ఉండవు. మా మధ్య పోటీ అయినా.. విరోధం అయినా మ్యాచ్ వరకే! మైదానం వెలుపల మేమంతా మంచి స్నేహితులం.. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటాం’’ అని వీరూ భాయ్ చెప్పుకొచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో పాక్ చేతిలో ఓటమి తర్వాత అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, నాటి మెంటార్ ఎంఎస్ ధోని పాక్ ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపి క్రీడా స్ఫూర్తిని చాటారు.
ఇక ఆసియా కప్- 2022 సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీసు సమయంలో పాక్ ఆటగాళ్లు రాగానే కోహ్లి వారిని పలకరించాడు. హార్దిక్ పాండ్యా, చహల్ సైతం అఫ్గన్, పాక్ ఆటగాళ్లతో ముచ్చటించారు. (ఇందుకు సంబంధించి వీడియో కింద చూడవచ్చు).
Hello DUBAI 🇦🇪
— BCCI (@BCCI) August 24, 2022
Hugs, smiles and warm-ups as we begin prep for #AsiaCup2022 #AsiaCup | #TeamIndia 🇮🇳 pic.twitter.com/bVo2TWa1sz
చదివండి: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్! భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి.. వీడియో వైరల్!
Comments
Please login to add a commentAdd a comment