భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఏ క్రీడలో అయినా, ఏ స్థాయి మ్యాచ్ అయినా భారీ అంచనాలు కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అయితే, దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ద్వారా ఇరు దేశాల క్రికెటర్లు, అభిమానులకు మరోసారి ఆ భావోద్వేగానుభూతికి లోనయ్యే అవకాశం దొరికింది.
టోర్నీలో భాగంగా రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం యువ భారత క్రికెటర్లు, పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించి, అభిమానుల మనసుల్లో చిరకాలం కొలువుండిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
భారత-ఏ క్రికెటర్లయితే తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లి చివరిసారి పాకిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటూ తాము కూడా అదే స్థాయి ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటున్నారు. నేపాల్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ (87) స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. తన దృష్టిలో ఆసియా కప్-2022లో పాక్‌తో జరిగిన మ్యాచ్లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ అని అన్నాడు.
మరో భారత-ఏ జట్టు సభ్యుడు రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి ముఖంలో, కళ్లలో కనిపించిన కసి అత్యద్భుతమని కొనియాడాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో రాణించిన సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ బౌలింగ్ కోహ్లి కొట్టిన ఓ షాట్ సూపర్ హ్యూమన్ షాట్ అని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు రేపు పాక్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లిలా చెలరేగాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment