ACC Mens Emerging Teams Asia Cup 2023- Pakistan A vs India A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భాగంగా భారత యువ జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ- పాకిస్తాన్- ఏ జట్లు బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్‌కు ఆదిలోనే షాకిచ్చాడు భారత యువ పేసర్ రాజ్‌వర్ధన్ హంగర్గేకర్. ఓపెనర్ సయీమ్ ఆయుబ్‌ను డకౌట్ చేశాడు.
ఐదు వికెట్లతో చెలరేగిన హంగర్గేకర్
అంతేకాదు.. వన్‌డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్‌తో కూడా సున్నా చుట్టించాడు. దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన పాక్‌ను ఓపెనర్ షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27) ఆదుకున్నారు. అయితే, భారత స్పిన్నర్ మానవ్ సుతార్, ఫాస్ట్‌బౌలర్ హంగేర్గకర్ వారిని ఎక్కువసేపు నిలవనీయలేదు. వీరిద్దరి విజృంభణతో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది.
ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కాసిం అక్రమ్(48) కాసేపు పోరాడాడు. అతడికి తోడుగా.. ముబాసిర్ ఖాన్(28) రాణించాడు. ఆఖర్లో మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులతో అజేయంగా నిలవడంతో 48 ఓవర్లలో పాకిస్తాన్ 205 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హంగేర్గకర్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. మానవ్‌కు మూడు, రియాన్ పరాగ్, నిషాంత్ సింధు ఒక్కో వికెట్ తీశారు.
సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభం అందించాడు. సెంచరీ(104)తో చెలరేగి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది శతకం పూర్తి చేసుకుని వారెవ్వా అనిపించాడు. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(20) నిరాశ పరచగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నికిన్ జోస్ అర్ధ శతకం(53)తో రాణించి సాయితో కలిపి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. మెహ్రాన్ బౌలింగ్‌లో నికిన్ అవుట్ అయ్యాడు.
హ్యాట్రిక్ విజయం
అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ యశ్ ధుల్ 19 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సాయి సుదర్శన్ అజేయ శతకం, నికిన్ జోస్ హాఫ్ సెంచరీ కారణంగా భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో భారత-ఏ జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం. అంతకు ముందు యూఏఈ, నేపాల్‌లపై భారీ విజయాలు నమోదు చేసింది.
చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..
Comments
Please login to add a commentAdd a comment