ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు కత్తులు దూసుకోనున్నాయి. గ్రూప్-బిలోని ఆఖరి మ్యాచ్‌లో ఈ ఇరు జట్లు ఎదురెదురుపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాక్‌లు గ్రూప్ దశలో చెరి రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పరంగా సమంగా ఉన్నాయి. అయితే పాక్ (2.875)తో పోలిస్తే భారత్ (3.792)కు మెరుగైన రన్‌రేట్ ఉండటంతో ప్రస్తుతానికి యంగ్ ఇండియా గ్రూప్ టాపర్‌గా ఉంది. గ్రూప్ దశలో భారత్, పాక్‌లు.. యూఏఈ, నేపాల్ జట్లపై విజయాలు సాధించాయి.
మరోవైపు గ్రూప్-ఏలో రసవత్తర పోరు సాగుతుంది. ఆప్ఘనిస్తాన్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలతో గ్రూప్ టాపర్‌గా ఉండగా.. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు 2 మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్ గెలిచి గ్రూప్‌లో రెండో బెర్తు కోసం పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఒమన్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పోటీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో టాపర్లుగా ఉన్న రెండు జట్లు సెమీఫైనల్లో తలపడతాయి. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ (జులై 18) బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు.. శ్రీలంక- ఒమన్ జట్లు తలపడనున్నాయి. రేపు భారత్-పాక్ మ్యాచ్‌తో పాటు నేపాల్-యూఏఈ మ్యాచ్ కూడా జరుగనుంది.
కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. యూఏఈపై 8 వికెట్ల తేడాతో, నేపాల్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. యూఏఈపై బౌలర్లలో హర్షిత్ రాణా (4), నితీష్ రెడ్డి (2), మానవ్ సుతార్ (2), అకాశ్ సింగ్ (1) రాణించగా.. బ్యాటింగ్‌లో కెప్టెన్ యశ్ ధుల్ అజేయ శతకంతో (108) మెరిశాడు. నికిన్ జోస్ (41 నాటౌట్) పర్వాలేదనిపించాడు.
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో నిషాంత్ సింధు (4), హంగార్గేకర్ (3), హర్షిత్ రాణా (2), మానవ్ సుతార్ (1) రాణించగా.. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ (58 నాటౌట్), అభిషేక్ శర్మ (87) దృవ్ జురెల్ (21 నాటౌట్) మెరిశారు.
Comments
Please login to add a commentAdd a comment