శ్రీలంక వేదికగా కొద్ది రోజుల కిందిట జరిగిన ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ ఏసియా కప్-2023 ఫైనల్లో పాకిస్తాన్-ఏ టీమ్.. యువ భారత జట్టుపై 128 పరుగుల తేడాతో గెలుపొంది, ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ గెలుపు తర్వాత కొందరు నెటిజన్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును విమర్శించడం మొదలుపెట్టారు.
పాక్ సీనియర్ జట్టుతో (అనుభవం+వయసు) ఆసియా కప్ బరిలోకి దిగిందని, ఫైనల్లో ఓడిన భారత్ యువ జట్టుతో పోరాడిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లపై తాజాగా పాక్-ఏ జట్టు కెప్టెన్ మహ్మద్ హరీస్ స్పందించాడు. తమ గెలుపును ఒప్పుకోని వారికి హరీస్ చురకలంటించాడు.
అంతర్జాతీయ అనుభవం లేని యువ భారత జట్టును ఆసియా కప్‌కు పంపమని తాము బీసీసీఐని అడగలేదని, అనుభవజ్ఞులున్నారంటున్న తమ జట్టులో ఒకరిద్దరూ మాత్రమే 10 లోపు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారని కౌంటరిచ్చాడు. మాకు పదుల సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంటే, ఆసియా కప్ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లకు వందల సంఖ్యలో (260 మ్యాచ్‌లు) ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది కదా అని ఎదురుదాడికి దిగాడు.
పెద్ద వయసు వారిని బరిలోకి దించామని అంటున్నారు.. భారత్-ఏ టీయ్ యావరేజ్ వయసు 20.80 అయితే, పాక్-ఏ జట్టు సగటు వయసు 23.20 అని, వయసు రిత్యా ఇది పెద్ద తేడా కాదని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు.
వాస్తవానికి బీసీసీఐ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ అనుభవం కూడా లేని యువ భారత జట్టును ఎమర్జింగ్ ఆసియా కప్‌కు పంపింది. అదే పాక్ మాత్రం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న ఏడుగురు ఆటగాళ్లను బరిలోకి దించింది. కెప్టెన్ సహా ఆ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు పాక్ టీ20 జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు.
ఎలాగైనా ఆసియా కప్ గెలవాలనే కుయుక్తితో పీసీబీ ఉద్దేశపూర్వకంగానే సీనియర్ జట్టును బరిలోకి దించిందన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు యువకులతో కూడిన జట్టే అయినా భారత్ ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించింది. ఫైనల్ వరకు చేరింది. అయితే ఫైనల్లో కొన్ని తప్పిదాల కారణంగా పాక్‌కు మ్యాచ్ అప్పగించింది.
కెప్టెన్ యశ్ ధుల్, సాయి సుదర్శన్, నికిన్ జోస్, నిషాంత్ సింధు, మానవ్ సుతార్, హర్షీత్ రాణా, హంగార్గేకర్ అద్భుతంగా రాణించారు. ఫైనల్లో తయ్యాబ్ తాహిర్ సెంచరీ చేయడంతో పాక్ 352 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో తడబడిన భారత్ 224 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment