నేరుగా ఆసియా క్రీడల్లో అడుగు.. అనూహ్య రీతిలో ఓటమి! ఎవరూ ఊహించలేరు.. | Asian Games 2023: Bajrang Punia Fails To Win Medal, Vinesh Defends Him | Sakshi
Sakshi News home page

నేరుగా ఆసియా క్రీడల్లో అడుగు.. అనూహ్య రీతిలో ఓటమి! ఎవరూ ఊహించలేరు..

Published Sat, Oct 7 2023 12:18 PM | Last Updated on Sat, Oct 7 2023 12:31 PM

Asian Games 2023: Bajrang Punia Fails To Win Medal Vinesh Defends Him - Sakshi

Asian Games 2023: ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాకు అనూహ్య ఓటమి ఎదురుకాగా... అమన్‌ (57 కేజీలు), మహిళల విభాగంలో సోనమ్‌ మలిక్‌ (62 కేజీలు), కిరణ్‌ (76 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక బౌట్‌లలో అమన్‌ 11–0తో లియు మింగు (చైనా)పై, సోనమ్‌ 7–5తో జియా లాంగ్‌ (చైనా)పై, కిరణ్‌ 6–3తో అరియున్‌జర్గాల్‌ (మంగోలియా)పై నెగ్గారు.   

బజరంగ్‌ విఫలం 
సెలెక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొనకుండా నేరుగా ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం దక్కించుకున్న భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా నిరాశపరిచాడు. చైనా నుంచి అతను రిక్తహస్తాలతో స్వదేశానికి రానున్నాడు.

పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన బజరంగ్‌ పూనియా కాంస్య పతక బౌట్‌లో 4 నిమిషాల 31 సెకన్లలో ఓడిపోయాడు. జపాన్‌ ప్లేయర్‌ కైకి యామగుచి 10–0తో బజరంగ్‌ను చిత్తుగా ఓడించాడు.

రెండునెలల పాటు నిరసనలో
రెజ్లింగ్‌ నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించిన వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బజరంగ్‌ తన సహచర రెజ్లర్లతో కలిసి దాదాపు రెండునెలలపాటు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.

దాంతో కొంతకాలంపాటు ఆటకు దూరంగా ఉన్న అతను ఆసియా క్రీడల్లో పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు. 2014 ఏషియాడ్‌లో బజరంగ్‌ 61 కేజీల్లో రజతం, 2018 ఏషియాడ్‌లో 65 కేజీల్లో స్వర్ణం నెగ్గాడు.

ఎవరూ ఊహించలేరు కూడా!
కాగా ఆసియా క్రీడల్లో విఫలమైన బజరంగ్‌కు మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ అండగా నిలిచారు. ‘‘బజరంగ్‌.. ఇప్పుడూ.. ఎప్పుడూ చాంపియనే! మహిళా రెజ్లర్ల పోరాటంలో అతడు అందించిన సహకారం మరువలేనిది. మాకోసం తను ఎంతగా కష్టపడ్డాడో ఎవరూ ఊహించలేరు కూడా!’’ అని వినేశ్‌ బజరంగ్‌ పునియాను ప్రశంసించారు.

నేరుగా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టి ఓటమిపాలైన నేపథ్యంలో బ్రిజ్‌ భూషణ్‌ మద్దతుదారులు బజరంగ్‌ను విమర్శిస్తున్న తరుణంలో.. లైంగిక వేధింపుల పోరాటంలో అతడు తమకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ వినేశ్‌ ఉద్వేగానికి లోనయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement