ఏషియన్‌ గేమ్స్‌లో మరో విధ్వంసకర శతకం.. 13 ఫోర్లు, 9 సిక్సర్లతో ఊచకోత | Asian Games 2023: Malaysia Opener Syed Aziz Hits Century In A Game, Scored 124 Runs In 56 Balls - Sakshi
Sakshi News home page

ఏషియన్‌ గేమ్స్‌లో మరో విధ్వంసకర శతకం.. 13 ఫోర్లు, 9 సిక్సర్లతో ఊచకోత

Published Mon, Oct 2 2023 2:29 PM | Last Updated on Mon, Oct 2 2023 5:16 PM

Asian Games 2023: Malaysia Opener Syed Aziz Hits Century In A Game Vs Thailand - Sakshi

ఏషియన్‌ గేమ్స్‌ 2023లో మరో విధ్వంసకర సెంచరీ నమోదైంది. ఈసారి మలేషియా ఆటగాడు ప్రత్యర్ధి థాయ్‌లాండ్‌ బౌలర్లేను ఊచకోత కోసి శతక్కొట్టాడు. కొద్ది రోజుల ముందు మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ ఆటగాడు కుషాల్‌ మల్లా టీ20ల్లోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ (34 బంతుల్లో) బాదగా.. తాజాగా మలేషియా ఆటగాడు సయ్యద్‌ అజీజ్‌ 56 బంతుల్లో 13 ఫోర్లు, 9 సిక్సర్లతో శివాలెత్తి 126 పరుగులు చేశాడు.

అజీజ్‌తో పాటు ముహమ్మద్‌ అమీర్‌ (25 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విరన్‌దీప్‌ సింగ్‌ (12 బంతుల్లో 30 నాటౌట్‌; 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో మలేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 268 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో అజీజ్‌ చేసిన సెంచరీ అంతర్జాతీయ టీ20ల్లో 12వ ఫాస్టెస్ట్‌ సెంచరీ కాగా.. మలేషియా చేసిన స్కోర్‌ అంతర్జాతీయ టీ20ల్లో నాలుగో అత్యధిక టీమ్‌ స్కోర్‌గా రికార్డైంది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన మలేషియా రికార్డు స్కోర్‌ సాధించగా.. ఛేదనలో చేతులెత్తేసిన థాయ్‌లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో థాయ్‌పై మలేషియా 194 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

మలేషియా బౌలర్లలో అహ్మద్‌ ఫయాజ్‌, విజయ్‌ ఉన్ని, విరన్‌దీప్‌సింగ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముహమ్మద్‌ అమిర్‌ అజిమ్‌ ఓ వికెట్‌ దక్కించుకుని థాయ్‌లాండ్‌ను దెబ్బకొట్టారు. థాయ్‌లాండ్‌ ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు మాత్రం అతికష్టం మీద రెండంకెల స్కోర్‌ చేయగా.. నొప్పొన్‌ సేనమోంత్రి చేసిన 15 పరుగులు ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోర్‌గా నిలిచింది. ఈ క్రీడల్లో భారత్‌ మ్యాచ్‌ రేపు జరుగనుంది. టీమిండియా రేపు క్వార్టర్‌ ఫైనల్‌-1లో నేపాల్‌తో తలపడనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement