Asian Games Mens T20I 2023- India vs Afghanistan, Final: ఆసియా క్రీడల్లో టీమిండియా స్వర్ణంతో మెరిసింది. భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా పసిడి గెలిచి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. కాగా చైనా వేదికగా హోంగ్జూలో రుతురాజ్ గైక్వాడ్ సేన శనివారం అఫ్గనిస్తాన్‌తో ఫైనల్లో తలపడింది.
టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత బౌలర్ల దాటికి అఫ్గన్ టాపార్డర్ కుదేలైంది. కేవలం 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షహీదుల్లా కమల్ 43 బంతుల్లో 49 పరుగులతో, కెప్టెన్ గులాబదిన్ నయీబ్ 24 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, వర్షం రాకతో సీన్ మారిపోయింది.
వరణుడి అంతరాయం కారణంగా 18.2 ఓవర్లలో అఫ్గనిస్తాన్ 5 వికెట్లు నష్టానికి 112 పరుగుల వద్ద ఉన్న వేళ మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం కురుస్తూనే ఉండటంతో మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
రుతురాజ్ సేనకు స్వర్ణం ఎలా అంటే?
ఈ నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాను స్వర్ణం వరించింది. ఇక భారత మహిళా క్రికెట్ జట్టు సైతం గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఇక రుతురాజ్ సేన విజయంతో భారత్ పసిడి పతకాల సంఖ్య 27కు చేరింది. అదే విధంగా 35 రజత, 40 కాంస్య పతకాలు రావడంతో మొత్తంగా 102 పతకాలతో పట్టికలో భారత్ నాలుగో ర్యాంకులో నిలిచింది.
ఆసియా క్రీడలు-2023లో రుతురాజ్ సేన ప్రయాణం
►పటిష్ట టీమిండియా నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.
►తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను 23 పరుగుల తేడాతో ఓడించింది.
►తొలి సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
►ఫైనల్లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ రద్దు కావడంతో పసిడి కైవసం.
చదవండి: శుభ్‌మన్ గిల్ కోసం సారా టెండూల్కర్ ట్వీట్
Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్.. బ్యాడ్మింటన్‌లో తొలి స్వర్ణం
Comments
Please login to add a commentAdd a comment