WI Vs AUS 3rd T20I : రసెల్‌ బ్యాటింగ్‌ విధ్వంసం.. 29 బంతుల్లోనే! | Aus Vs WI 3rd T20I Andre Russell 29 Ball Top Knock | Sakshi
Sakshi News home page

WI Vs AUS 3rd T20I : రసెల్‌ బ్యాటింగ్‌ విధ్వంసం: సిక్సర్ల వాన.. 29 బంతుల్లోనే!

Published Tue, Feb 13 2024 3:35 PM | Last Updated on Tue, Feb 13 2024 4:14 PM

Aus Vs WI 3rd T20I Andre Russell  29 Ball Top Knock - Sakshi

Australia vs West Indies, 3rd T20I: ఆస్ట్రేలియాతో మూడో టీ20లో వెస్టిండీస్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. పెర్త్‌ మ్యాచ్‌లో కంగారూ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. 

కేవలం 29 బంతుల్లోనే ఏకంగా 244కు పైగా స్ట్రైక్‌రేటుతో 71 రన్స్‌ సాధించాడు. ఆసీస్‌ బౌలింగ్‌ను చితక్కొడుతూ నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో ఈ మేరకు ఆండ్రీ రసెల్‌ పరుగుల సునామీ సృష్టించాడు. హిట్టర్‌ అన్న బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు.

కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లలో ఓడిన విండీస్‌.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పెర్త్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

రూథర్‌ఫర్డ్‌, రసెల్‌ దంచికొట్టారు
టాపార్డర్‌ మొత్తం కలిపి కనీసం 20 పరుగులు కూడా చేయకుండానే నిష్క్రమించడంతో భారమంతా మిడిలార్డర్‌పై పడింది. ఈ క్రమంలో నాలుగు.. వరుసగా ఆ తర్వాతి స్థానాలో దిగిన రోస్టన్‌ చేజ్‌(20 బంతుల్లో 37), కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌(14 బంతుల్లో 21) రాణించగా.. షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న రూథర్‌ఫర్డ్‌ 67 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక రూథర్‌ఫర్డ్‌కు జతైన 35 ఏళ్ల ఆండ్రీ రసెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో రసెల్‌.. స్పెన్సర్‌ జాన్సెన్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న కరేబియన్‌ జట్టు.. వన్డే సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మాత్రం ఆ ఫలితం పునరావృతం కాకూడదని ప్రయత్నం చేస్తోంది. 

చదవండి: IPL 2024- SRH: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా అతడే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement