సిడ్నీ: టీ20 ఫార్మాట్‌లో టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోని లాంటి అద్భుతమైన ఫినిషర్ ప్రతి జట్టుకు అవసరమని, జట్టులో అలాంటి ఆటగాడు లేకపోతే ఎంత మేటి జట్టైనా ఏ ప్రయోజనం లేదని ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అక్టోబర్‌లో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజయావకాశాలపై పాంటింగ్ స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ప్రస్తుత ఆసీస్ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు కొదవ లేకున్నా.. లోయర్ మిడిలార్డర్‌లో ధోని, హార్ధిక్ పాండ్యా లాంటి ఫినిషర్లు లేకపోవడం జట్టు విజయావకాశాలను కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు.
వికెట్ కీపింగ్ నైపుణ్యంతో పాటు ఆఖరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టగలిగే ధోని లాంటి ఆటగాడిని ఆసీస్ జట్టు తయారు చేసుకోలేకపోయిందని, దీని ఫలితాన్ని ఆ జట్టు గత కొన్నేళ్లుగా అనుభవిస్తుందని చెప్పుకొచ్చాడు. టీ20 ఫార్మాట్‌లో ఫినిషర్ స్థానం ఎంతో ప్రత్యేకమని, చివరి మూడు, నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేయాలంటే అదే సరైన స్థానమని అభిప్రాయపడ్డాడు. పాండ్యా, పోలార్డ్ లాంటి ఆటగాళ్లు ఇదే ఫార్ములాను అమలు చేసి సత్ఫలితాలు సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆసీస్ జట్టులో వార్నర్, ఫించ్, మ్యాక్స్‌వెల్ లాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నప్పటికీ.. వారంతా టాపార్డర్ ఆటగాళ్లే కావడం వల్ల జట్టు ఆశించిన స్థాయి విజయాలు నమోదు చేయలేకపోతుందని వాపోయాడు.
అయితే స్టొయినిస్, పాట్ కమిన్స్ లాంటి ఆటగాళ్లు మంచి ఫినిషర్లుగా మారే అవకాశముందని ఈ ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ అభిప్రాయపడ్డాడు. గిల్‌క్రిస్ట్ లాంటి విధ్వంసకర కీపర్‌ను అందించిన జట్టులో ప్రస్తుతం ఆ స్థాయి ఆటగాడు లేకపోవడం విచారకరమని, ఇకనైనా వికెట్ కీపింగ్ స్థానంపై ఆస్ట్రేలియా జట్టు ఓ క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా, ప్రస్తుతం ఆసీస్ జట్టులో మాథ్యూ వేడ్, ఫిలిప్, అలెక్స్ క్యారీలు వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్లుగా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరిని ఎప్పుడు తుది జట్టులోకి తీసుకుంటుందో జట్టు మేనేజ్‌మెంట్‌కే ఎరుక అని చురకలంటించాడు.
చదవండి: ఆ బౌలర్ ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడు..
Comments
Please login to add a commentAdd a comment