India V Australia 3rd Test: Australia Skittle India For 109 To Dominate First Day - Sakshi
Sakshi News home page

భారత్‌ 109 ఆలౌట్‌

Published Thu, Mar 2 2023 5:20 AM | Last Updated on Thu, Mar 2 2023 9:05 AM

Australia skittle India for 109 to dominate first day of third Test - Sakshi

నిజంగానే నిజం! 109 పరుగులకే ఆలౌటైంది ఆస్ట్రేలియా కాదు... భారతే! గత రెండు టెస్టుల్లో ఎదురులేని టీమిండియా జోరు చూసినోళ్లకు ఇది కచ్చితంగా షాకే! చూసినోళ్లకే కాదు... మైదానంలో ఆడుతున్న భారత్‌కూ ఊహించని షాక్‌. గత రెండు టెస్టుల్లో తమ భరతం పట్టిన ఆతిథ్య జట్టును ఆసీస్‌ దెబ్బ తీసింది. అనంతరం బ్యాటింగ్‌లో నిలకడగా ఆడుతూ తొలిరోజే పటిష్టమైన ఆధిక్యానికి శ్రీకారం చుట్టింది.  

ఇండోర్‌: తనదైన రోజున ఓ ఆటగాడిని లేదంటే జట్టుని అంత తేలిగ్గా తీసుకోరాదనేది ఇండోర్‌ టెస్టు మొదలైన రోజును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆస్ట్రేలియా స్పిన్‌ ద్వయం కునెమన్‌ (5/16), లయన్‌ (3/35) టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఒక్క సెషన్‌లోనే కుదేలు చేసింది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 33.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. కోహ్లి (52 బంతుల్లో 22; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌! అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా 54 ఓవర్లలో 4 వికెట్లకు 156 పరుగులు చేసింది. 47 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చేతిలో ఇంకా 6 వికెట్లున్నాయి. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాజా (147 బంతుల్లో 60; 4 ఫోర్లు) రాణించాడు. జడేజాకు 4 వికెట్లు దక్కాయి.  

రాహుల్‌ స్థానంలో గిల్‌
కెప్టెన్‌ రోహిత్‌ ఫామ్‌లో లేని రాహుల్‌ను కాదని శుబ్‌మన్‌ గిల్‌తో ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేశాడు. సీమ్‌ బౌలింగ్‌ను చక్కగా ఎదుర్కోవడం, బౌండరీలు సులువుగా రావడంతో అనుభవజ్ఞుడైన స్మిత్‌ ఆరో ఓవర్లోనే స్పిన్నర్‌ కునెమన్‌ను దించాడు. ఈ ఎత్తు ఫలితమివ్వగా... కెప్టెన్‌ రోహిత్‌ (23 బంతుల్లో 12; 3 ఫోర్లు) స్టంపౌటయ్యాడు. తన మరుసటి ఓవర్లో గిల్‌ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు)ను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో కెప్టెన్‌ స్మిత్‌ బంతిని పూర్తిగా స్పిన్నర్ల చేతుల్లోనే పెట్టాడు. లయన్‌ కూడా తన తొలి ఓవర్లోనే వెటరన్‌ పుజారా (1)ను అసాధారణ టర్న్‌తో బౌల్డ్‌ చేశాడు.

36 పరుగులకే టాపార్డర్‌ పెవిలియన్‌కెళ్లింది. లయన్‌ తన తదుపరి ఓవర్లో జడేజా (4)ను బోల్తా కొట్టించాడు. స్లో డెలివరీని బౌండరీ కొట్టాలనుకుంటే అక్కడే ఉన్న కునెమన్‌ చురుగ్గా అందుకున్నాడు. మరుసటి ఓవర్లో... అదికూడా కేవలం 2 బంతుల వ్యవధిలోనే శ్రేయస్‌ అయ్యర్‌ (0) విస్మయపరిచే రీతిలో వెనుదిరిగాడు. కునెమన్‌ బంతి అయ్యర్‌ బ్యాట్‌ అంచును తగిలి వికెట్లను తాకీతాకనట్లుగా వెళ్లింది. బెయిల్‌ నెమ్మదిగా కిందకు పడటం... ఈ లోపు కీపర్‌ నుంచి బంతి వికెట్ల వైపు రీబౌండ్‌ కావడంతో అయ్యర్‌ తాను అవుట్‌ కాదనే భ్రమలో ఉండిపోయాడు.

టీవీ అంపైర్‌ రీప్లే చూసి అవుటివ్వడంతో క్రీజు వీడక తప్పలేదు. 11.2 ఓవర్లలో 45 పరుగులకే సగం (5) వికెట్లు కూలడంతో భారత్‌ కష్టాల్లో పడింది. అందరికంటే ఎక్కువ బంతులు, ఎక్కువసేపు క్రీజులో నిలిచిన కోహ్లిని మూడో స్పిన్నర్‌ మర్ఫీ ఎల్బీగా పంపాడు. కోహ్లి రివ్యూకెళ్లినా ఫలితం లేకపోయింది. శ్రీకర్‌ భరత్‌ (17; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా త్వరగానే అవుటయ్యాడు. 84/7 స్కోరు వద్ద లంచ్‌కెళ్లిన భారత్‌... రెండో సెషన్‌ మొదలైన కాసేపటికే 100 పరుగుల్ని కష్టంగా దాటి... అంతలోపే ఆలౌటైంది.  

2: కపిల్‌ దేవ్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు తీసుకోవడంతోపాటు 5000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు.
1: టెస్టుల్లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో ఎక్స్‌ట్రాలు ఇవ్వని తొలి జట్టుగా ఆస్ట్రేలియా
నిలిచింది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వలేదు.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (స్టంప్డ్‌) క్యారీ (బి) కునెమన్‌ 12; గిల్‌ (సి) స్మిత్‌ (బి) కునెమన్‌ 21; పుజారా (బి) లయన్‌ 1; విరాట్‌ కోహ్లి (ఎల్బీ డబ్ల్యూ) (బి) మర్ఫీ 22; రవీంద్ర జడేజా (సి) కునెమన్‌ (బి) లయన్‌ 4; శ్రేయస్‌ అయ్యర్‌ (బి) కునెమన్‌ 0; భరత్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్‌ 17; అక్షర్‌ పటేల్‌ (నాటౌట్‌) 12; అశ్విన్‌ (సి) క్యారీ (బి) కునెమన్‌ 3; ఉమేశ్‌ యాదవ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కునెమన్‌ 17; సిరాజ్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (33.2 ఓవర్లలో ఆలౌట్‌) 109.
వికెట్ల పతనం: 1–27, 2–34, 3–36, 4–44, 5–45, 6–70, 7–82, 8–88, 9–108, 10–109.
బౌలింగ్‌: మిచెల్‌ స్టార్క్‌ 5–0–21–0, కామెరాన్‌ గ్రీన్‌ 2–0–14–0, కునెమన్‌ 9–2–16–5, నాథన్‌ లయన్‌ 11.2–2–35–3, మర్ఫీ 6–1–23–1.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: ట్రావిస్‌ హెడ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 9; ఉస్మాన్‌  ఖాజా (సి) గిల్‌ (బి) జడేజా 60; లబుషేన్‌ (బి) జడేజా 31; స్టీవ్‌ స్మిత్‌ (సి) భరత్‌ (బి) జడేజా 26; హ్యాండ్స్‌కాంబ్‌ (బ్యాటింగ్‌) 7; గ్రీన్‌ (బ్యాటింగ్‌) 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (54 ఓవర్లలో 4 వికెట్లకు) 156.
వికెట్ల పతనం: 1–12, 2–108, 3–125, 4–146.
బౌలింగ్‌: అశ్విన్‌ 16–2–40–0, రవీంద్ర జడేజా 24–6–63–4, అక్షర్‌ పటేల్‌ 9–0–29–0, ఉమేశ్‌  యాదవ్‌ 2–0–4–0, సిరాజ్‌ 3–0–7–0.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement